'బాయ్‌కాట్ తాండవ్' : సైఫ్ అలీఖాన్‌కు నిరసనల సెగ.. భద్రత కట్టుదిట్టం
బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించిన వెబ్ సిరీస్ తాండవ్.. ఓటీటీలో ప్రదర్శించడంపై వివరణ ఇవ్వాలని అమెజాన్ ప్రైమ్‌ను కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ కోరినట్లు సమాచారం.
తాండవ్ వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాం కదమ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్ సిరీస్ క్రియేటర్లు, నటులు, డైరెక్టర్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచారంటూ, ఇది ప్రతీసారి జరుగుతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు.
మరోవైపు, సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సైఫ్ తాజా వెబ్ సిరీస్ తాండవ్‌లో దేవుళ్లను అవమానించారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ సిరీస్ ఉందంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దానిని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. బాయ్‌కాట్ తాండవ్, బ్యాన్ తాండవ్ హ్యాష్‌ట్యాగ్‌లతో వైరల్ చేస్తున్నారు.
తాండవ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు బీజేపీ ఎంపీ మనోజ్ కుమార్ కొటక్ లేఖ రాశారు.
ఈ సిరీస్‌లో దేవుళ్లను ఎగతాళి చేయడం, సెక్స్, హింస, మాదక ద్రవ్యాల వాడకంతోపాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని మనోజ్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. వెబ్‌సిరీస్‌పై ఆందోళనలు పెరుగుతుండడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, వెబ్ సిరీస్‌లో ఈశ్వరుడ్ని ఎగతాళి చేశారని రాం కదం మండిపడ్డారు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వెబ్ సిరీస్‌ల ప్రదర్శన విషయమై నియంత్రణకు ఒక సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. అంతకుముందు బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ సైతం.. ఓటీటీలో వెబ్ సిరీస్‌ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని శనివారం జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు.