శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (09:28 IST)

హెల్మెట్ లేకుండా పట్టుబతే ఆ పని చేస్తేనే వదిలిపెడతాం : సైబరాబాద్ పోలీసుల వార్నింగ్

గత యేడాది ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ఏకంగా 300 మంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో ఈ యేడాది ఈ మృతుల సంఖ్యను తగ్గించాలని హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇందులోభాగంగా, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని అమల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా, హెల్మెట్ లేకుండా రోడ్డెక్క పోలీసులకు పట్టుబడితే మాత్రం.. హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాతనే బండితో పాటు లైసెన్సును తిరిగి ఇవ్వనున్నారు. ఈ విషయంలో మరింత కఠినంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.
 
గత యేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే, అత్యధిక శాతం మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణమని తేలింది. దీంతో ఈ విషయంలో మరింత కఠినంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది 663 ప్రమాదాలు జరిగితే 700 మంది అసువులు బాసారు. 
 
వీరిలో 400 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, హెల్మెట్ ధరించి ఉంటే వీరిలో కనీసం 300 మంది బతికి బయటపడేవారని తమ పరిశీలనలో తేలినట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. హెల్మెట్ ధరించని వారికి చలానాలు విధిస్తున్నప్పటికీ చాలామంది చెల్లించకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే అప్పటికప్పుడు కొత్త హెల్మెట్ కొనుగోలు చేయించి దానిని ధరించిన తర్వాత వదిలిపెట్టనున్నారు. వెంటనే హెల్మెట్ తెచ్చుకున్నా, కొత్తది కొనుగోలు చేసినా కేసు నమోదు చేయకుండా వదిలిపెడతారు. లేదంటే మాత్రం కేసు నమోదు చేస్తారు. 
 
ఇలా చేస్తే వాహనదారులు తొలుత కొంత ఇబ్బందిపడినా, ఆ తర్వాత అలవాటుపడిపోతారని చెబుతున్నారు. తొలుత నాలుగు జాతీయ రహదారులపై దీనిని అమలు చేసి, ఆ తర్వాత అన్ని రోడ్లపైనా అమలు చేయనున్నారు.