సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (21:51 IST)

'పొన్నియన్ సెల్వన్' సినిమాను తీయడం ఎంతో గర్వంగా ఉంది. : మణిరత్నం

ponniyin selvan
ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్‌ సినిమా "పొన్నియిన్‌ సెల్వన్‌". లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదలకానుంది. పీయస్‌-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
తమిళ్‌, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక సమయంలో విడుదల చేయనున్నారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ చిత్రంలోంచి "చోళ చోళ" అనే పాటను విడుదల చేశారు. 
 
ఈ ఈవెంట్‌లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి. ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్క నటీనటులు కొత్తగా కనిపిస్తుంటారు. విక్రమ్ చిన్న పాత్రలు చేస్తూ.. శివ పుత్రుడుతో జాతీయ అవార్డు సాధించారు. విక్రమ్, కార్తీ, సూర్య ఇలా అందరూ ఎంతో మంచి మనసున్నవారు. ఈ చిత్రంలో భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. సుహాసిని అంటే మా కుటుంబ సభ్యురాలు. ఆమె ప్రతీ పుట్టిన రోజుకు ఆమెకు విషెస్ అందిస్తుంటాను. మణిరత్నం ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని అన్నారు.
 
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘పొన్నియన్ సెల్వన్ గురించి చాలా మంది మాట్లాడారు. చాలా విషయాలు తెలుసుకున్నారు. ఒక ఆరు దశాబ్దాల క్రితం చోళ సామ్రాజ్యం గురించి కల్కి రాసిన అద్భుతమైన చరిత్ర. ఇది జానపదమైన ఓ కథ. అలాంటి ఓ కథ సినిమా అవ్వడం చాలా గొప్ప విషయం. ఈ కథను సినిమాగా తీయాలని ఎంతో మంది అనుకున్నారు. కానీ గుర్రం ఎక్కేవాడు.. నడిపేవాడు ఒకడు కావాలి. ఇన్నేళ్లకు మణిరత్నం వచ్చారు. ఆయన కూడా ఓ దశాబ్దకాలంగా ఈ చిత్రం గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు అందరికీ కలిసి వచ్చింది. అన్ని భాషల్లో నటించి పాన్ ఇండియన్ నటుడు అవ్వడం వేరే. దక్షిణి భారత దేశం నుంచి ఆయన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నం. బాహుబలి అనేది కాల్పనిక కథ. కానీ మణిరత్నం వ్యక్తిత్వం, సంబంధాల గురించి తీస్తుంటారు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇలాంటి సినిమా దొరికినప్పుడు పెద్ద అనుభవం అవుతుంది. అన్ని భాషలకు చెందిన అద్భుతమైన నటీనటులు అందరూ కలిసి చేశారు’ అని అన్నారు.
 
చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు మణి సర్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆయనతో ఇది వరకు రావణ్ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. మణితో పని చేస్తున్నానంటూ అది నాకు కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్ గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చుని అనుకున్నాను. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు. మణిగారి సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు.
 
కార్తీ మాట్లాడుతూ.. ‘మణిరత్నం గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను చేశాను. ఎవరెవరికో దక్కాల్సిన పాత్ర నాకు దక్కింది. కల్కి గారు రాసిన నవలే ఈ పొన్నియన్ సెల్వన్. ఎంతో మంది ఈ నవలను సినిమాను తీయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మణిగారి వల్ల ఈ చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తోటీ నటీనటుల వల్ల ఎంతో నేర్చుకున్నాను. ప్రతీ ఒక్క పాత్రకు ఓ లక్ష్యం ఉంటుంది.. ఆ గమనంలో ఉండే డ్రామా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ నేల మీద, సముద్రాలు, అడవుల్లో జరుగుతుంది. 
 
ఇలాంటి చిత్రాలు తీయాలంటే మణిరత్నం గారు, ఏఆర్ రెహ్మాన్ గారు ఉండాలి. అప్పట్లోని రాజకీయాల మీద ఈ చిత్రం ఉంటుంది. రియల్ కారెక్టర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా రీసెర్చ్ చేసి ఈ నవలను రాశారు. అత్యధికమంది కొన్న పుస్తకంగా పొన్నియన్ సెల్వన్ రికార్డులు క్రియేట్ చేసింది. రవివర్మన్ కెమెరాపనితనం మీరు చూడబోతోన్నారు. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.
 
నాజర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ఎంతో ఎమోషనల్ మూమెంట్ ఇది. మేం ఎన్నో సినిమాలు చేసి ఉంటాం. కానీ ఇది మా హృదయాలను తాకిన సినిమా. అరవై ఏళ్ల నుంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. లిటరేచర్‌లో పొన్నియన్ సెల్వర్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. కల్కిగారు ఆరు అధ్యాయాలుగా రాశారు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెంతో మంది ప్రయత్నించారు. కానీ అది మణిరత్నం గారి వల్లే సాధ్యమైంది. నాయకుడు సినిమాతోనే నన్ను ఇంకా గుర్తిస్తారు. మణిరత్నం సత్తా మరోసారి చాటబోతోన్నారు. ఆయన సినిమానే శ్వాసిస్తుంటాడు. ఎన్నో హిస్టారికల్ సినిమాలు వచ్చాయి.. హిట్ అయ్యాయి. సౌత్‌లో జరిగిన బిగ్గెస్ట్ హిస్టరీ. ఈ సినిమాను మనం ప్రోత్సహించాలి. ఈ చిత్రం ఓ హిస్టరీగా నిలవబోతోంది. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అమృత అనే సినిమా వల్లే నిర్మాతగా నేను మారాను. ఇప్పుడు 50 చిత్రాలు నిర్మించే నిర్మాతగా నిల్చున్నాను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన మణిరత్నం గారికి థాంక్స్. కంటెంట్ బాగుంటే ఎక్కడి నుంచి వచ్చిందని చూడకుండా ఇండియా మొత్తం ఆదరిస్తోంది. చోళ రాజుల గురించి అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. బిగ్ కాంబోతో ఇస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
సుహాసిని మాట్లాడుతూ.. ‘మా పుట్టింటికి మా వారు వచ్చారు. ఇది నా పుట్టిళ్లు. ఈ సినిమాకు మీరంతా సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని చాలా కష్టపడి తీశారని అంటారు. కానీ ఆయన కష్టపడి తీయరు.. ఇష్టపడి తీస్తారు. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడిగితే.. కాదు నాకు ఇష్టమైన చిత్రమని అంటాడు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను.. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు.. అంటే మీరు (ఆడియెన్స్) ఈ చిత్రాన్ని ఇష్టపడాలి. వేరే దారి లేదు’ అని అన్నారు.
 
మణిరత్నం మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారికి థాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది. రెండు పార్టులుగా ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకే ఆయనకు థాంక్స్. నా బిడ్డ లాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజు గారిదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి. తనికెళ్ల భరణిగారికి థాంక్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను తీయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.