మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (21:46 IST)

అసభ్యకరమైన వీడియో షూట్ చేసిన కేసులో పూనమ్ పాండే అరెస్టు!

బాలీవుడ్ నటి పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ కట్టడాల వద్ద తిరగడమే కాకుండా, అక్కడ అసభ్యకరమైన వీడియోను షూట్ చేసిన కేసులో ఆమెను గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఉత్తర గోవాలోని సింక్వెరిన్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉన్న పూనంను పోలీసు బృందం అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ప్రశ్నించడం కోసమే పూనం పాండేను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 
 
కాగా, ఇటీవల పూనమ్ పాండే గోవా పర్యటనకు వెళ్లారు. అక్కడ చపోనీ ఆనకట్ట వద్ద ఆమె ఓ అశ్లీల వీడియోను చిత్రీకరించింది. ఇలా చేయడం డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీయడమేనని ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆరోపణలు చేస్తూ, ఏకంపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పూనమ్‌తోపాటు ఆ వీడియోను చిత్రీకరించిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పూనమ్ పాండేపై గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో పూనం పాండేపై బుధవారం పోలీసు కేసు నమోదైంది. కనకోనా టౌన్‌లో ఉన్న చపోలీ డ్యామ్ వద్ద ఫొటో షూట్ చేసిందంటూ గోవా రాష్ట్ర నీటి వనరుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును నమోదు చేశారు. 
 
ఇదేసమయంలో పట్టణంలో పలువురు పూనంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ తుకారం చవాన్, మరో కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హామీ ఇవ్వడంతో స్థానికులు బంద్ ఆలోచనను విరమించుకున్నారు.