మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పిన పృధ్వీ
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో ఫేమస్ అయిన నటుడు పృధ్వీరాజ్ దాదాపు 200పైగా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. వై.సి.పి. పార్టీలో చేరి తిరుమల దేవస్థానంలో మంచి పోస్ట్‌ను దక్కించుకున్నారు. కానీ అక్కడే అతని కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు. అందుకే రాజకీయంగా వున్న హంగుతో సినిమారంగంలోని పలువురిపై పలురకాలుగా విమర్శలు చేశారు. దాని పర్యావసానం ఆ తర్వాతగానీ తనకు తెలియలేదని ఇందుకు ప్రతి ఒక్కరినీ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
ముక్కుసూటిగా వుండే వాడికి రాజకీయాలు పడవు. నాకు పదవి రావడమే భగవంతుని వరంగా భావించాను. కానీ నామీద పడి ఏడ్చేవారు చాలా మంది వున్నారని అప్పుడు గ్రహించలేకపోయా. నేను ఎక్కడ వున్నా గొడ్డులా చాకిరీ చేస్తాను. కానీ నాకు గుణపాఠం వచ్చింది. నేను అప్పట్లో తప్పుగా కొన్ని మాటలు మాట్లాడాను.
నేను వ్యతిరేక పార్టీ అని తెలిసి కూడా నాకు సైరాలో మెగాస్టార్ చిరంజీవిగారు పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. నా బంధువులు, స్నేహితులే నాకు వెన్నెపోటు పొడిచారని తెలిసే సరికి అంతా అయిపోయింది. ఆఖరికి నాకు కోవిడ్ వచ్చినప్పుడు చలనచిత్ర రంగమే ఆదుకుంది. సాయికుమార్, ఆది, జీవితా రాజశేఖర్ కుటుంబం, బెనర్జీ, కృష్ణ భగవాన్, రఘుబాలు వీరంతా ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నాకు రీబర్త్ లాంటిది లైఫ్. అందుకే అరుణాచలం వెళ్ళాను. అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేశాను. నా కళ్ళ ముందు కొన్ని కనిపించాయి. అందరితో శత్రుత్వం ఎందుకు? ప్రేమతో దగ్గరకు తీసుకో. అంటూ వినిపించాయి.
అప్పట్లో ఇండస్ట్రీలో పెద్దలెవరూ వెళ్ళలేదు ఆయన దగ్గరకి అంటూ నేను అన్నాను. ఇప్పుడు ఆ పెద్దలంతా ఒక్కటయ్యారు. నేను ఒక్కడినే వేరుగా అయ్యాను. ఈ సందర్భంగా అశ్వనీదత్‌గారికి, చింజీవి, పవన్‌కళ్యాణ్, నాగబాబుకూ మెగా ఫ్యామిలీ హీరోలందరికీ నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. త్వరలో మీముందుకు వస్తాను. నేను ఒకడుగువేస్తే మీరు వంద అడుగులు నాతో వేయిస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.