బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (18:14 IST)

ది గోట్ లైఫ్ కోసం 31 కిలోలు తగ్గాను. చిరంజీవి గారితో కలిసి పనిచేస్తా : పృథ్వీరాజ్ సుకుమారన్

Prithviraj Sukumaran
Prithviraj Sukumaran
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  తెలుగులో రిలీజ్ చేస్తోంది.

ఈ సందర్భంగా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ - ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయ్యింది. ఇది పబ్లిష్ అవగానే ప్రతి ఒక్కరి చేతుల్లోకి వెళ్లింది. అంత ఆదరణ పొందింది గోట్ డేస్. కేరళలో ప్రతి దర్శకుడు, హీరో,  ప్రొడ్యూసర్ ఈ నవల హక్కులు తీసుకోవాలని ప్రయత్నించారు. చివరకు ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ సాధించారు. అదృష్టవశాత్తూ నజీబ్ గా నటించే అవకాశం నాకు దక్కింది. 2009 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే  ఆ టైమ్ లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. 
 
Prithviraj Sukumaran, Director Blessy, Actor Jimmy Jean Lewis, Y Ravi Shankar, Shashi
Prithviraj Sukumaran, Director Blessy, Actor Jimmy Jean Lewis, Y Ravi Shankar, Shashi
పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం. అప్పటికి ప్రాంతీయ సినిమాల మార్కెట్ స్థాయి పెరిగింది. మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగింది. 2019లో షూటింగ్ ప్రారంభించాం. జోర్డాన్ లో షెడ్యూల్ చేశాం. కేరళ పోర్షన్స్ కంప్లీట్ చేశాం. నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే. మేము తిరిగి జోర్డాన్ లో  షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్ లో ఇండియా వచ్చాం. పాండమిక్ ఎప్పటికి ఆగిపోతుందో తెలియదు. ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహార ఎడారి మధ్యలో ఉంటుందా లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్ కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం.  బ్లెస్సీ సార్ తో మలయాళ ఇండస్ట్రీ ప్రతి ఆర్టిస్ట్ ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. అంత గొప్ప దర్శకుడాయన. అల్జీరియా తర్వాత జోర్డాన్ తిరిగొచ్చి మిగిలిన పార్ట్ షూట్ చేశాం. 2022 కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లాం. ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా జీరో కాంప్రమైజ్డ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఒక్క ఫ్రేమ్ కూడా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో రాజీ పడకుండా రూపకల్పన చేశాం. 2008 లో అనుకున్న సినిమా ఫైనల్ గా 2024 మార్చి 28న మీ ముందుకు వస్తోంది. ఇంత కష్టపడిన ఈ సినిమాను పర్పెక్ట్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. 
 
అదృష్టవశాత్తూ తెలుగులో మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది నా కెరీర్ లో ఎంతో ముఖ్యమైన సినిమా అని రవి గారికి మెసేజ్ పంపాను. ఆయన డన్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. తమిళంలో రెడ్ జయింట్, కన్నడలో హోంబలే ఫిలింస్, నార్త్ లో నా ఫ్రెండ్ అనిల్ రిలీజ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంటుంది. ఈ సినిమా చూశాక ప్రేక్షకులెవరూ ఈ సినిమాను ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అని అనరు. మీ అందరికీ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. చిరంజీవి గారి సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీ రోల్ కోసం నన్ను అడిగారు. అప్పుడు ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నా అందుకే నటించలేకపోతున్నా అని ఆ విషయాన్ని ఆయనకు వివరించాను. ఆ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్  ను నన్నే డైరెక్టర్ చేయమన్నారు.  
 
అప్పడు కూడా గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చిరంజీవి గారు అన్నారు నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అని. మీ సినిమాలో నటించడం నాకెంతో ఇష్టం సార్ కానీ కుదరడం లేదు అని హంబుల్ గా చెప్పాను. ఆ తర్వాత చిరంజీవి గారు రెగ్యులర్ గా మెసేజ్ స్ పంపుతూ ఉండేవారు. గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున కూడా మెసేజ్ పంపారు. ఫ్యూచర్ లో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తా. అన్నారు.
 
నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ - "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగులో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి వండర్ ఫుల్ ఫిల్మ్ ను మా సంస్థ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం గర్వంగా ఉంది. కొత్త తరహా సినిమాలు కావాలని కోరుకునే వారికి సమాధానంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాను సేమ్ క్వాలిటీ , ప్యాషన్ తో మలయాళంలో 25 కోట్ల రూపాయలతో రూపొందిస్తారు. 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూ వంద కోట్ల రూపాయలకు పైనే అనుకోవచ్చు. ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ గారు ఎన్నో ఏళ్లు శ్రమించి రూపొందించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ గారు, రసూల్ పూకుట్టి వంటి గ్రేట్ టెక్నీషియన్స్ పనిచేశారు. సాంగ్స్ బిగ్ హిట్ అయ్యాయి. లాక్ డౌన్ టైమ్ లో అయ్యప్పనుమ్ కోషియమ్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్ వంటి గొప్ప మలయాళ మూవీస్ చూశాను. మలయాళ మూవీస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మల్టీ టాలెంటెడ్. మన మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేసిన లూసిఫర్ సినిమాను మలయాళంలో ఆయన దర్శకత్వంలో రూపొందించారు. ఆయన నటించిన మరో గ్రేట్ ఫిల్మ్ ఇది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా తెలుగులో తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అన్నారు.
 
దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ - తెలుగు స్టేట్స్ లో మా సినిమాను రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ రవి గారికి, శశి గారికి థ్యాంక్స్. తెలుగు ఆడియెన్స్ అందరికీ కృతజ్ఞతలు. తెలుగు నాకు ఇష్టమైన భాష. మలయాళంకు దగ్గరగా ఉంటుంది. నెక్ట్ టైమ్ తెలుగులో మాట్లాడుతాను. మొదట ఈ సినిమాను రాజస్థాన్ ఎడారిలో షూట్ చేయాలని అనుకున్నాం. అయితే అక్కడ డీప్ డిజర్ట్ లొకేషన్స్ దొరకలేదు. అరేబియన్ గొర్రెలకు మన వాటికి తేడా ఉంటుంది. ఇలాంటి డీటెయిల్స్ వల్ల విదేశాలకు వెళ్లి  షూటింగ్ చేశాం. మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్ డాలర్ కు ఇండియా రూపీ మారకం 60 రూపాయలు, ఇప్పుడది 83 రూపాయల దాకా వచ్చింది. ఈ ఫ్లక్షువేషన్ మా బడ్జెట్ మీద ప్రభావం చూపించింది. దాదాపు 150 రోజులు ఎడారిలో షూటింగ్ చేశాం. అక్కడ ఖర్చు ఎక్కువైంది. బడ్జెట్ పెరిగినా మేము అనుకున్న ఫీల్ సినిమాలో తీసుకురాగలిగాం. అన్నారు.
 
హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ మాట్లాడుతూ - నేను నటించిన మొదటి భారతీయ చిత్రమిది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) వంటి అద్భుతమైన చిత్రంతో ఇండియన్ ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను ఇబ్రహీం ఖాద్రీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఇదొక కీలక పాత్ర. హీరో క్యారెక్టర్ నజీబ్ చేస్తున్న సుదీర్ఘ ప్రయాణంలో అతనికి హెల్ప్ చేసే క్యారెక్టర్ నాది. ఈ సినిమా కోసం ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో షూటింగ్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరినీ అప్రిషియేట్ చేయాలి. జోర్డాన్ వంటి కంట్రీస్ లో షూటింగ్ చేశాం. నెలలు, ఏళ్లుగా చిత్రీకరణ సాగింది. ఒక టైమ్ లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ పూర్తి చేయగలమా లేదా అనిపించింది. కానీ మా డైరెక్టర్ బ్లెస్సీ పట్టుదలగా చిత్రీకరణ పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం వివిధ నగరాల్లో ప్రమోషన్ చేస్తున్నాం. ఈ నెల 28న థియేటర్స్ లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా చూడండి. మీరు తప్పకుండా థ్రిల్ అవుతారు. అన్నారు.
 
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి మాట్లాడుతూ - "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా టీమ్ అందరికీ వెల్ కమ్ చెబుతున్నాం. ఈ సినిమాను మా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. కేరళ కొచ్చిలో ఈ సినిమా ఈవెంట్ కు వెళ్లాం. మలయాళం సినీ పరిశ్రమలో  ఇప్పటిదాకా చేయనంత భారీ ఈవెంట్  చేశారు. ఈ సినిమా కథకు మూలమైన గోట్ డేస్ నవలకు కేరళలో 250 ఎడిషన్స్ పబ్లిష్ చేశారు. ప్రతి కేరళ వాసికి ఈ గోట్ డేస్ నవల, అందులోని క్యారెక్టర్స్ తెలుసు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగే స్ఫూర్తిని ఈ సినిమా ప్రేక్షకులకు కలిగిస్తుంది. అన్నారు.