శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (18:25 IST)

బాలకృష్ణకు అవమానం జరిగితే సహించను : నిర్మాత సి. కళ్యాణ్

నందమూరి హీరో బాలకృష్ణకు అవమానం జరిగితే సహించే ప్రసక్తే లేదని నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. ఇటీవల షూటింగులను పునఃప్రారంభించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బాలకృష్ణ దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనను ఇదే అంశంపై మీడియా ప్రశ్నించగా, ఆ విషయం తెలియనే తెలియదు అని చెప్పారు. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నిర్మాత సి.కళ్యాణ్ వివరణ ఇచ్చారు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా డాక్టర్ దాసరి నారాయణ రావు ఉండేవారన్నారు. కానీ, ఆయన పోయిన తర్వాత ఇపుడు చిరంజీవి ఉన్నారన్నారు. అందుకే, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లే సమయంలో తాము చిరంజీవిని పిలవగా, ఆయన తమతో పాటు వచ్చారని తెలిపారు. అలాగే, నాగార్జున కూడా వచ్చారని... అవసరమైతే పిలవండి వస్తానని బాలయ్య కూడా తనతో చెప్పారని అన్నారు. ఇక ఇందులో వివాదమేమీ లేదన్నారు. 
 
పైగా, ఎక్కడ ఎవరు అవసరమైతే... అక్కడకు వారిని తీసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సినిమాలకు సంబంధించి పనులు జరగడమే తమకు ముఖ్యమని, తాము ఏ పార్టీలకూ సంబంధించిన వారం కాదని అన్నారు. తామంతా తెలుగు సినిమావాళ్లమని చెప్పారు.
 
తమ హీరో బాలయ్యేనని... ఇక్కడ జరిగినవన్నీ ఆయనకు తాను చెప్పానని అన్నారు. చర్చలకు మిమ్మలను పిలవలేదా? అని మీడియా ఆయనను అడిగిందని... అందుకే తనకు తెలియదు, పేపర్లో చూసి తెలుసుకున్నానని ఆయన సరదాగా చెప్పారని తెలిపారు. గతంలో అనేక విషయాల్లో బాలయ్యను ముందు పెట్టామని గుర్తు చేశారు. పైగా, బాలయ్యకు అవమానం జరిగితే మాత్రం సహించే ప్రసక్తే లేదని సి.కళ్యాణ్ స్పష్టం చేశారు.