ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జులై 2024 (16:02 IST)

లావణ్యతో సహజీవనం చేసిన మాట వాస్తమే.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు : హీరో రాజ్ తరుణ్

Raj Tarun's Ex-Lover Lavanya
లావణ్య అనే యువతితో సహజీవనం చేసిన మాట వాస్తవమేనని హీరో రాజ్ తరుణ్ చెప్పారు. అయితే, ఆమెను పెళ్లి చేసుకుంటానని మాత్రం తాను హామీ ఇవ్వలేదని, ఈ విషయంలో లావణ్య అబద్ధాలు చెబుతుందని రాణ్ తరుణ్ తాజాగా వ్యాఖ్యానించారు. కాగా, తనతో సహజీవనం చేసిన సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఓ యంగ్ హీరోయిన్‌కు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, నార్సింగ్‌ పోలీసులు శుక్రవారం లావణ్యకు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పేర్కొంటూ 91 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశారు.
 
మరోవైపు, తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన లావణ్య హైదరాబాద్‌ వచ్చినపుడు దగ్గరైందని, తామిద్దరం సహజీవనం చేసిన మాట నిజమేనని తెలిపారు. కానీ గతంలో ఆమె డ్రగ్స్‌తో పట్టుబడి అరెస్టయిందని, ఆమెను కేసులో ఇరికించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామన్న మాటలు అవాస్తవమేనని చెప్పారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. 
 
కాగా, హైదరాబాద్ కోకాపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న లావణ్య 11 ఏళ్లుగా రాజ్‌ తరుణ్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇటీవల కొత్తగా సినీ రంగానికి వచ్చిన ఓ నటితో రాజ్‌తరుణ్‌ సంబంధం ఏర్పరచుకొని తనను దూరంగా ఉంచినట్లు లావణ్య వివరించారు. త్వరలో తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు.