మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (14:29 IST)

మొరగని కుక్క - లోపం చెప్పన నోరు.. ఈ రెండూ లేని ఊరు ఉండదు : రజనీకాంత్

rajinikanth
ఈ సమాజంలో మొరగని కుక్క... లోపం చెప్పని నోరు.. ఈ రెండు లేని ఊరు ఉండదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం "జైలర్". ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం శుక్రవార రాత్రి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇందులో రజనీకాంత్ పాల్గొని ప్రసంగిస్తూ... 
 
ఎస్పీ ముత్తురామన్, బాలు మహేంద్రన్, రాజశేఖర్, సురేష్ కృష్ణ, కేఎస్ రవికుమార్, పా.రంజిత్ వంటి దర్శకుల కారణంగా ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు 1977లోనే సూపర్‌స్టార్ అనే బిరుదు (ట్యాగ్)ను నిర్మాత థాను ఇచ్చారు. ఎప్పటి నుంచో దీన్ని తొలగించాలని కోరుతున్నాను. దీంతో కొందరు నేను భయపడ్డానంటూ కామెంట్స్ చేస్తున్నారు. కష్టపడేతత్వం, శ్రమ, ఆధిపత్యం, అణిచివేత, పోరాటం వంటి వాటి మధ్య ఎదిగిన వ్యక్తిని నేను. నేటి తరానికి ఇవేమీ తెలియవు. 
 
నేను ఇద్దరికి మాత్రమే భయపడతాను. ఒకటి దేవుడు, రెండోది మంచి వ్యక్తికి. మంచి వారి శాపం ఎప్పటికైనా మనకి హాని చేస్తుంది. మంచివారికి భయపడితీరాలి. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెబుతాను. పక్షుల్లో కాకి ఎల్లవేళలా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. గద్ద పట్ల కూడా కాకి ఆ విధంగానే నడుచుకుంటుంది. కానీ, గద్ద మాత్రం ఏమీ చేయదు. దాని దారిలో ఆది వెళుతూ ఓ స్థాయికి చేరుతుంది. 
 
కాకి మాత్రం గద్దతో పోటీ పడుతుంది. దానికంటే ఎత్తుగా ఎగిరేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యంకాదు. నేను కాకి, గద్ద అని చెప్పగానే ఫలానా వ్యక్తినే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవుతాయి. మొరగని కుక్క. లోపం చెప్పని నోరు ఉండదు. ఈ రెండూ ఉండని ఊరు ఉండదు. వీటన్నింటికి మౌనమే సరైన సమాధానం. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే మన కర్తవ్యం. 
 
నేను బెంగుళూరులో నాటకాల్లో నటించే సమయంలో మద్యానికి బానిసయ్యాను. మద్యానికి అలవాటు పడటం వల్ల ఎన్నో కోల్పోయాను. ఈ చెడు అలవాటు లేకుండా ఉండివుంటే ఇంతకంటే పైస్థాయిలో ఉండేవాడిని. దయచేసి ఎవరూ మద్యం సేవించవద్దు. తాగుబోతు స్నేహితులతో చేరవద్దు. మద్యం తాగాలని అనిపించినపుడు కడుపునిండా భోజనం చేసి కంటినిండా నిద్రపోండి. పది రోజుల్లో మద్యం తాగే అలవాటును మరచిపోతారు. దేవుడు, అభిమానులు ఒక కంచుకోటలా నన్ను కాపాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే పక్షుల్లో గద్ద ఎగిరే ఎత్తుకు కాకి ఎంత ప్రయత్నించినా చేరుకోలేదంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు నటుడు విజయన్‌ను ఉద్దేశించినవేనని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 'సూపర్ స్టార్ ట్యాగ్‌పై రజనీ అభిమానులకు - విజయ్ అభిమానులకు మధ్య పోటీ నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి వుంటారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.