నిర్మాతగా నిజమైన మెగాస్టార్‍ను చూస్తున్నా : సైరా నిర్మాత
దేశ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు "సైరా నరసింహా రెడ్డి" జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాగా, ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు వంటి అగ్ర నటీనటులు నటిస్తున్నారు.
అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పనులను నిర్మాతగా రామ్ చరణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సైరా ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో 'నరసింహా రెడ్డి' గెటప్‌లో ఉన్న చిరంజీవికి సూచనలు ఇస్తూ రామ్‌చరణ్ కనిపిస్తున్నారు.
'సైరా పాత్రలో నాన్న పరకాయ ప్రవేశం చేశారు. ఆయన అభినయం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. నేను నిర్మాతగా మారిన తర్వాతే నిజమైన మెగాస్టార్‌ను చూశాననే భావన కలిగింది' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫొటో మెగాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రానికి ఏ.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, గాంధీ జయంతి సందర్భంగా అంటే అక్టోబరు రెండో తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.