చిరంజీవి అబద్ధం చెప్తున్నారు... కేసులన్నీ వెనక్కి : ఉయ్యాలవాడ వంశీకులు
మెగాస్టార్ చిరంజీవి అబద్ధం చెప్తున్నారనీ, ఆయన చెప్పినట్టుగా తాము ఒక్కో కుటుంబానికి రూ.2 కోట్లు చొప్పున డిమాండ్ చేయలేదని ఉయ్యాలవాడ వంశీకులు స్పష్టంచేశారు. చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ చిత్ర కథకు సంబంధించిన అంశాలు సేకరించే విషయంలో ఉయ్యాలవాడ వంశస్థులకు ఆర్థికంగా ఆదుకుంటామని చిత్ర యూనిట్ హామీ ఇచ్చిందట.
కానీ, చిత్ర షూటింగ్ ముగిసి, విడుదలకు సిద్ధమవుతుండగా, ఉయ్యాలవాడ వంశీయులు తమకు న్యాయం జరగలేదని పేర్కొంటూ కేసులు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను ఎవరో ఉసిగొల్పారని, వారు 23 కుటుంబాల వారు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు కోట్లు చొప్పున డిమాండ్ చేశారని చిరంజీవి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే దీనిపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు స్పందించారు. చిరంజీవి చెప్పినట్లు తమ వంశీకులు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు చెల్లించమని అడగలేదని, ఆయన అబద్ధం చెబుతున్నారని అన్నారు. అయితే చరణ్ ఇదివరకు చెప్పినట్లు తాము ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు అడిగామని తెలిపారు. సినిమా విడుదల సందర్భంగా తాము సినిమాకు సంబంధించి వేసిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.