తిరుమల వెంకన్నను వర్మ అలా వాడుకుంటున్నారా? తేడా కొడుతుందేమోననీ...(Video)
తిరుమల శ్రీవారు ఎందరికో ఆరాధ్య దైవం. మరెందరికో సెంటిమెంట్ దైవం. ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టేటప్పుడు శ్రీవారిని దర్సించుకుంటే అది నెరవేరుతుందన్నది నమ్మకం. ఇలాంటి నమ్మకం రాజకీయ నాయకుల తరువాత సినిమా వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. అయితే చాలాకాలం నాస్తికుడిగా ముద్రపడిన రాంగోపాల్ వర్మ శ్రీవారిని దర్శించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. రాంగోపాల్ వర్మ శ్రీవారి దర్శనం వెనుక భక్తి.. లేక సెంటిమెంటా... అంతకు మించిన సినిమా ప్రమోషనా?
ఏదైనా వెరైటీగా చేసి జనాల్లో నలగడం వర్మకు అలవాటు. వివాదాలనే కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్న వర్మ సినిమాలు హిట్టవకపోయినా వివాదాలతో మాత్రం హిట్ మీద హిట్ కొడుతూ ఉంటాడు. అలాంటి వర్మ మరో సంచలనమైన పని చేశాడు. దేవుళ్ళపైన, సాంప్రదాయాలపైన గతంలో ఎంతో పరుష పదజాలంతో కామెంట్స్ చేసిన వర్మ అదే దేవుడి ముందు మోకరిల్లాడు. సాంప్రదాయ దుస్తుల్లో దేవుడిని దర్శించుకుని తనపై ఉన్న నాస్తిక ముద్రను పోగొట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే వర్మ భక్తితో ఈ పని చేశాడా.. అంటే కాదనే చెబుతున్నారు.
దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తరువాత నాస్తికుడైన మీరు దేవుడి దర్శనానికి ఎందుకు వెళ్ళారంటూ ప్రశ్నించిన మీడియాతో మరోసారి లాజికల్ సమాధానం చెప్పాడు వర్మ. దేవుడితో నమ్మకంతో దర్శనానికి వెళ్ళలేదని, తాను తీయబోయే సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ అత్యంత భక్తిపరుడు కాబట్టి ఆయన సినిమా తీస్తున్న సంధర్భంగా స్వామివారిని దర్శించుకున్నానన్నారు వర్మ. అయితే వర్మ తిరుమల దర్శనంలో భక్తి కంటే కూడా పబ్లిసిటీ యాంగిలే ఎక్కువగా కనిపిస్తోంది. తాను చేయబోయే సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో భాగంగానే ఎంతో కాలంగా తాను నమ్మిన నాస్తికత్వాన్ని విడిచి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే దీనిపైన కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. వర్మ ఏం చేసినా తాను నమ్మి చేయడని, కేవలం పబ్లిసిటీ కోసమే తన ఆలోచనలు, మాటలు మారుస్తూ ఉంటారంటున్నారు కొంతమంది విమర్శకులు.
షూటింగ్‌కు మొదలే తిరుమల దర్శనంతో వార్తల్లోకెక్కిన వర్మ సినిమా పూర్తయ్యేంత వరకు ఈ ట్రెండ్‌ను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పొలిటికల్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాటు మరోవైపు లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ప్రధానంగా పెట్టడం.. ఇంకోవైపు ఈ సినిమాకు వైసిపి నేత నిర్మాతగా వ్యవహరించడం.. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఆయా దశల్లో తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవాలన్న ఆలోచనలో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రామారావు జీవిత చరిత్రలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్మ సినిమాలో చూపిస్తారు. అందులో ఎవరి పాత్రలు ఎలా ఉండబోతున్నదన్నది ఆశక్తికరంగా మారుతోంది. అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ మరణం సంభవించేంత వరకు జరిగిన విషయాలనే ప్రధానంగా వర్మ తన సినిమాలో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా చేస్తున్నానని వర్మ అనౌన్స్ చేసిన వెంటనే స్పందించిన లక్ష్మీపార్వతి వర్మపై అనేక విమర్శలు చేశారు. తన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించకుండా తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపించినా కోర్టుకు వెళ్ళడానికి కూడా వెనకాడనంటూ అప్పట్లో లక్ష్మీపార్వతి హెచ్చరించారు. అయితే ఇప్పుడు అదే లక్ష్మీపార్వతిని వెంటపెట్టుకుని మరీ స్వామివారి దర్శనం చేసుకోవడం, సినిమా పట్ల ఆమె కూడా తన సంతోషాన్ని, సానుకూలతను వ్యక్తం చేయడం పొలిటికల్‌గా మరింత హీట్ ఎక్కించింది.
ప్రస్తుతానికి లక్ష్మీపార్వతి వైసిపిలో ఉండటం, సినిమాకు డబ్బులు పెడుతున్న వ్యక్తి కూడా వైసిపి పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయంగా చంద్రబాబును ఈ చిత్రంలో విలన్‌గా చూపిస్తారనే ప్రచారం అయితే వర్మపై ఇప్పటికే టిడిపి నేతలు గుప్పిస్తున్నారు. మరోవైపు సినిమాను ఆపేయాలని, సినిమాలో చంద్రబాబును బ్యాడ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనను బెదిరించారంటున్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. ఎవరెన్ని విధాలుగా బెదిరించినా సినిమాను ఆపేది లేదంటున్నారాయన.
ముఖ్యంగా ఎపి సిఎం చంద్రబాబు క్యారెక్టర్ పైనే అందరి దృష్టి ఉంది. ఆ క్యారెక్టర్‌ను కొత్త వ్యక్తితో చేయించడం ద్వారా వర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరలైన చంద్రబాబులాగే ఉన్న ఒక వ్యక్తి అడ్రస్ కనుక్కుని మరీ అతనితో ఈ క్యారెక్టర్ వేయించబోతున్నారు వర్మ. అయితే మిగిలిన నటీనటులు ఎవరు... కథ ఏంటి అన్న విషయాన్ని తన ట్రైలర్లో సూటిగా చెప్పినప్పటికీ సినిమా వచ్చేంత వరకు దానిపైన అనేక సందేహాలు కలిగే అవకాశముంది. చూడాలి మరి... వర్మ తీయబోయే ఎన్టీఆర్ మూవీ ఎన్ని వివాదాలకు తెరలేపబోతోందో..? చూడండి వీడియో...