'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రణబాలిగా కనిపించనున్నారు. ఆయన నటించే కొత్త చిత్రానికి ఆ టైటిల్‌ను ఖరారు చశారు. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ టైటిల్‌ను ప్రకటించారు. అయితే, ఈ సినిమా గ్లింప్స్‌ను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చేసినట్టు నెటిజన్లు కామెంట్స్ చేయగా, వాటిపై చిత్ర దర్సకుడు రాహుల్ సంకృత్యాన్ వివరణ ఇచ్చారు.
ఇందులోని ప్రతి ఫ్రేమ్ పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేసినట్లు రాహుల్ సంకృత్యాన్ తెలిపారు. ఈ వీడియోను సిద్ధం చేయడానికి తన టీమ్‌కు కొన్ని నెలల సమయం పట్టిందన్నారు. దీంతో ఏఐ ఉపయోగించారనే వార్తలకు చెక్ పడింది. కృత్రిమ మేథ సాయం లేకుండానే ఇలాంటి హైక్వాలిటీ వీడియోను అద్భుతంగా డిజైన్ చేశారంటూ పలువురు టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
'రణబాలి' విషయానికొస్తే.. 'టాక్సీవాలా' విజయం తర్వాత విజయ్ - రాహుల్ కాంబోలో రెండో సినిమా ఇది. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ముస్తాబవుతోంది. జయమ్మగా రష్మిక కనిపించనుండగా.. సర్ థియోడోర్ హెక్టార్ అనే బ్రిటిష్ అధికారి పాత్రలో ఆర్నాల్డ్ అలరించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.