ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (14:57 IST)

రంగస్థల నటుడి జీవిత ఆవిష్కరణ రంగ మార్తాండ రివ్యూ రిపోర్ట్‌

Rangamarthda
Rangamarthda
ఈమధ్య మనిషి జీవితానికి సంబంధించిన కథలు వస్తున్నాయి. అందులో రంగమార్తాండ కథ ఒకటి. ఇది షేక్స్‌ పియర్‌ రాసిన ఓ నాటకాన్ని మరాఠీలో కూర్చి నాటకం వేశారు. అదే సినిమాగా కూడా వచ్చింది. నానా పటేకర్‌ టైటిల్‌ పాత్ర పోషించాడు. దాన్ని తెలుగులో ప్రకాష్‌రాజ్‌ మాత్రమే చేయగలడని అనిపించి ఆయనకు చెప్పడం. దాన్ని కృష్ణవంశీ చేతికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజే విడుదలైన రంగమార్తాండ ఎలా వుందో చూద్దాం.
 
కథ:
చిరంజీవి వాయిస్ తో కథ మొదలవుతుంది.  రాఘవరావు (ప్రకాష్‌రాజ్‌) నాటకరంగంలో తన నటనతో రంగమార్తాండ బిరుదూనూ, గండబేరుండాన్ని పొందిన గొప్ప నటుడు. ఆ కళతోనే ఉన్నతస్థాయికి చేరుకున్నవాడూనూ. ఆయనకు తోడుగా వెన్నంటి రంగస్థలంలో వున్న మరో నటుడు బ్రహ్మానందం. ఇద్దరూ మంచి స్నేహితులు. ఓ దశలో వయస్సురీత్యా నాటకరంగంనుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటాడు రాఘవరావు. రాఘవరావు భార్య రమ్యకృష్ణ. కొడుకు ఆదర్శ్‌, కోడలు అనసూయ, కూతురు (శివాత్మిక), అల్లుడు రాహుల్‌ సిప్లిగంజ్‌.  జనరేషన్‌ గేప్‌తో పలు ఇబ్బందులు ఎదుర్కొంటాడు రాఘవరావు. ఫైనల్‌గా ఇంటినుంచి వెళ్ళిపోవాల్సివస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఈ సినిమా నేపథ్యం రంగస్థలం. కథంతా చాలా సినిమాల్లో చూసిన నేపథ్యాలే. అయితే నటుడిగా తను ఎటువంటివాడో ప్రకాష్‌ రాజ్‌ ప్రతి సన్నివేశంలో చూపించాడు. తనే ఈ పాత్రకు సరైన వాడని నిరూపించుకున్నాడు. స్నేహితుడిగా చేసిన బ్రహ్మానందం పాత్ర కూడా ఓ దశలో అతనిలోని ఎమోషన్స్‌ బయటపెట్టే క్రమంలో జీవించేశాడు. అన్ని రంగాల్లోని వారి జీవితాలు చివరి దశలో ఎలా వుంటయనేవి చూశాం. కానీ రంగస్థలం నటుల జీవితాలు ఎలా వుంటయనేవి ఇందులో చూపించారు. 
 
పిల్లలు లేక భార్యను కోల్పోయి ఒంటరి అయిన బ్రహ్మానందం పాత్రలో అసలు జీవితం ఏమిటో చెప్పాడు. పిల్లలున్నా మానసిక శాంతిలేక ఎటువంటి క్షోభను అనుభవించారో ప్రకాష్‌రాజ్‌ ను చూపించాడు. ఈ రెండు పాత్రలే సినిమాలో కీలకం. కొడుకు కోడలు, కూతురు, అల్లుడు పాత్రలు ఇప్పటి జనరేషన్‌కు ఎలా సరిపోయారో అనేవి కూడా చూపించారు. ఒక వయస్సు వచ్చాక పెద్దలు కూడా పిల్లలులాంటివారే. వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అనే సందేశం ఇచ్చాడు.
 
మరోవైపు తెలుగును ఇప్పటి కార్పొరేట్‌ స్కూల్స్‌ ఏవిధంగా చులకనగా చూస్తున్నాయో ఇప్పటి జనరేషన్‌ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో అనేవి కూడా కనువిప్పుగా అనిపిస్తాయి. రమ్మకృష్ణ పాత్రకు పెద్దగా డైలాగ్స్‌ లేకపోయినా తన మౌనంతోనే హావభావాలు పలికిస్తుంది. శివాత్మిక చాలా బాగా నటించింది. రాహుల్‌ సిప్లిగంజ్‌ మంచి అల్లుడిగా కనిపించాడు. 

అయితే, భార్య పోయి ఒంటరి అయినా బ్రహ్మానందం పాత్ర చెప్పే డైలాగ్స్ ఎవర్గ్రీన్. కానీ అంత స్నేహితుడుని ఒంటరిగా వదిలేసి చివరిలో ప్రకాష్ రాజ్ రావడం అంత బాగోలేదు. అందుకు సినిమాటిక్  డైలాగ్స్ చెప్పినట్లుంటుంది. ఇదే మైనస్. 
 
రంగస్థలంలో మనకు తెలీని కోణాలు ఎన్నో వున్నాయి. వారి జీవితాలు ఎలా వుంటాయో ఎవరికీ తెలీవు. షేక్‌పియర్‌ రాసిన నవల ఆధారంగా రాసిన కథను ఇండియాలో కూడా సినిమా తీయడం విశేషమే. ఇప్పుడు తెలుగులోకూడా వచ్చింది. అయితే ఎమోషన్స్‌ హెవీమోతాదులో అనిపిస్తాయి. సిరివెన్నెల సాహిత్యం కూడా నేపథ్య సంగీతానికి బాగా తోడయింది. జీవిత పరమార్థం ఏమిటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. 
 
ఇలాంటి సినిమా చూస్తే గతంలో వచ్చిన కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. చదరంగం కూడా ఇంచుమించు అలాంటిదే. ఇక ఈ సినిమాకు బలం ఇళయరాజా సంగీతం. ప్రకాష్‌రాజ్‌ అద్భుతమైన నటనకు నిదర్శనం ఈ సినిమా. 
 
దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలం తర్వాత రీమేక్‌ను తీసుకుని సక్సెస్‌ కొట్టాలని చేసిన ప్రయత్నం. కమర్షియల్‌ సినిమాలు చేసిన ఆయన చాలాకాలం దూరంగా వున్నాడు. మరలా తనలోని దర్శకుడిని ఇప్పటితరానికి తెలియచెప్పే ప్రయత్నం చేశాడు. ఇది కుటుంబంతో చూడతగ్గ సినిమా.