ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (14:36 IST)

నా చిత్రాలను అనువాదం చేసి రిలీజ్ చేయొద్దు : నిర్మాతలను కోరిన మహేశ్ బాబు

Mahesh Babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనుంది. ‘#SSMB29’గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్స్ రానప్పటికీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
తన సినిమాల విషయంలో మహేశ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి ప్రాజెక్ట్‌తో మహేశ్‌ పాన్‌ వరల్డ్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బాలీవుడ్‌ వెండితెరపై ఈ సినిమాతోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని ఆయన ఫిక్స్‌ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్‌ చేసి థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటివరకు మహేశ్‌ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో ఇదే తన తొలి చిత్రమవుతుందని ఆసక్తిగా ఉన్నారు. అందుకే అక్కడి ఆడియన్స్‌ను అలరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పండగలకు, మూవీ యూనిట్‌లో వాళ్ల పుట్టిన రోజులకు దీని నుంచి ఏమైనా అప్‌డేట్‌ ఇస్తారేమో అని ఆశపడ్డారు. అయితే రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. 
 
సినిమాలో ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా వచ్చేంతవరకూ విశ్రమించని జక్కన్న.. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో మరింత శ్రద్ధపెట్టారట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్రతిదాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, లోకేషన్స్‌, నటీనటుల ఎంపిక తదితర విషయాల్లో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే సినిమా అప్‌డేట్స్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్‌. ఈ యేడాది చివరి నాటికి సినిమాకు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నారు. 
 
కొత్త సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన సినిమాల గురించి ప్రెస్‌ మీట్‌ పెట్టి అప్‌డేట్స్‌ ఇవ్వడం రాజమౌళికి అలవాటు. మహేశ్‌ మూవీ విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని భావిస్తున్నారు. ఏదేమైనా మహేశ్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈ సినిమా నుంచి చిన్న అప్‌డేట్‌ వస్తే బాగుండనుకుంటున్నారు.