శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (22:56 IST)

ఎస్... సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేశా? : నిజాన్ని అంగీకరించిన రియా

ఎస్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మాదకద్రవ్యాలను కొనుగోలు చేసినట్టు అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) జరిపిన విచారణలో వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. సుశాంత్ కోసం తాను డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నటి రియా అంగీకరించింది. తన సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆమె అధికారులకు తెలిపింది. కాగా, ఆదివారం కూడా ఎన్.సి.బి ఆరు గంటల పాటు విచారణ జరిపింది. అలాగే, సోమవారం కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఎన్సీబీ విచారణ తర్వాత సీబీఐ కూడా మరోమారు రియా చక్రవర్తిని విచారించనుంది. 
 
ఇదిలావుండగా, బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరయ్యారు. అయితే ఎన్సీబీ అధికారుల ముందు దర్యాప్తుకు హాజరయ్యేందుకు వచ్చిన రియాను మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం ముందుకు కదిలేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, చాలామంది రియా పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి కూడా తీవ్రంగా స్పందించారు. "ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ. ఓ మహిళతో వ్యవహరించాల్సిన విధానం ఇది ఎంతమాత్రం కాదు. మరొకరి పట్ల ఇంత భయంకరంగా ఎలా ఉండగలరు? ఓ మనిషి పట్ల ఎలాంటి హుందాతనం చూపకుండా దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.