బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (13:35 IST)

ముత్యాల సుబ్బయ్య సమర్పణలో తల్లి మనసు

Bramhanandam and Mutyala Subbaiah
Bramhanandam and Mutyala Subbaiah
యాభైకి పైగా సినిమాలను తీసిన ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రం "తల్లి మనసు". రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా సినీరంగంలో దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్  (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
 
Talli manasu team
Talli manasu team
హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభోత్సవం కాగా, ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు క్లాప్ నివ్వగా, ఏషియన్ గ్రూప్ ఎం.డి. భరత్ నారంగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు.
 
అనంతరం ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ,  "టైటిల్ ను చూస్తేనే ఇది ఎంత మంచి సబ్జెక్టు అన్నది అర్ధమవుతుంది. మా అబ్బాయి అభిరుచే ఈ బ్యానర్ స్థాపనకు కారణమయ్యింది. తల్లి పాత్ర కోసం ఎంతోమందిని ప్రయత్నించాం. ఎట్టకేలకు పాత్రలో ఒదిగిపోయే మంచి ఆర్టిస్టు రచిత దొరికారు. నా దగ్గర ఎంతో మంది సహాయ, కో- డైరెక్టర్లుగా పనిచేశారు. వి.శ్రీనివాస్  (సిప్పీ)లో అద్భుతమైన టాలెంట్ చూసి, ఆయనకు అవకాశం కల్పించాం" అని అన్నారు.
 
దర్శకుడు వి.శ్రీనివాస్  (సిప్పీ) మాట్లాడుతూ, ``పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పవన్ కల్యాణ్ గారి సినిమాలతో పాటు ముత్యాల సుబ్బయ్య, ఎస్.జె.సూర్య, త్రివిక్రమ్ గార్ల వంటి పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశాను. ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఆమె మనోవేదన, సంఘర్షణను ఇందులో ఆవిష్కరిస్తున్నాం" అని చెప్పారు.
 
చిత్ర నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ,"ఒక మంచి సినిమా తీయాలన్న సంకల్పమే ఈ సినిమాకు కారణం. నాన్న పేరు నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది. ప్రారంభం రోజు నుంచి యాభై రోజుల పాటు నిర్విరామంగా జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తాం. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు.
 
నటీ నటులు రచిత మహాలక్ష్మి,  సాత్విక్, సాహిత్య మాట్లాడుతూ, నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రలు తమకు లభించాయని ఆనందం వ్యక్తం చేయగా, ఈ సమావేశంలో రచయితలు మరుధూరి రాజా, నివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, శ్రీహర్ష  తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్  (సిప్పీ) .