సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (15:49 IST)

అజిత్‌కు కోపం వచ్చింది.. సెల్ ఫోన్ లాగి జేబులో పెట్టుకున్నారు.. పోతూ పోతూ..?

Ajith_Shalini
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో హీరో అజిత్‌ తన సతీమణి షాలినితో కలిసి ఓటేసేందుకు చెన్నైలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి వచ్చినప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 
 
తన భార్య షాలినితో కలిసి చెన్నైలో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న హీరో అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. తొలుత వారిని ఏమీ అనకుండా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు అజిత్ అవకాశం ఇచ్చారు.
 
పోలింగ్‌ బూత్‌ ముందు క్యూ ఉన్నా సెలబ్రిటీ కావడంతో పోలీసులు ఆయన్ను పక్క నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఓటరు స్లిప్‌ తీసుకునే సమయంలో మరోసారి ఆయన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. తాను ఓటరు స్లిప్‌ తీసుకుంటుండగా ఓ అభిమాని సెల్ఫీ కోసం పదే పదే ప్రయత్నిస్తుండటంతో హీరో అజిత్ అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. 
 
అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మౌనంగా తన ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటపడ్డాడు. అభిమానులు ఓటేయనీయకుండా సెల్ఫీల కోసం ఎగబడటం వల్లే హీరో అజిత్‌ ఈ సెల్‌ఫోన్‌ లాక్కున్నట్లు తెలిసింది. అంతేగాకుండా మాస్క్ ధరించకుండా సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్సుకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు తెలుస్తోంది.

మాస్క్ ధరించకుండా బయట తిరగకూడదని ఫ్యాన్సును ఆయన హెచ్చరించారు. ఇంకా పోలింగ్ కేంద్రం బయటికి వచ్చాక అభిమానికి సెల్‌ఫోన్ ఇచ్చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సారీ చెప్పారు. అందుకు అభిమాని కూడా ఓకే తల అంటూ సానుకూలంగా స్పందించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.