సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (18:46 IST)

హైద‌రాబాద్ తెలీనోడికి అదృష్టం ప‌ట్ట‌డం అంటే ఇదే - రాజ్ తరుణ్

Raj Tarun
రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం అనుభవించు రాజా. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు.
 
- సినిమాలోని పాత్రకు నా నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అనుభవించు రాజాలో ప్రకృతి, వికృతి రెండూ ఉంటాయి.
 
- సెక్యూరిటీ గార్డ్ అవ్వాలంటే వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందా? అనేది చూశానే. సెక్యూరిటీ గార్డ్ అంటే అంత ఈజీ కాదని తెలిసింది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చూసే ఫస్ట్ మొహం, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు చూసే చివరి మొహం సెక్యూరిటీ గార్డ్‌దే. వాళ్లు ఒక్క చిరు నవ్వుతో తలుపు తీస్తే మనకు బాగుంటుంది. అదే చిరగ్గా తీశారంటే రోజంతా కూడా మన మూడ్ అలానే అవుతుంది.
 
- సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాకు ఈ సినిమాకు దర్శకుడు చాలా మార్పు చెందారు. అప్పుడు కుర్రాడు. ఇప్పుడు ఎంతో కంపోజర్ వచ్చింది. ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. పాజిటివిటీ, హానెస్టి ఇలా చాలా వచ్చాయి. పని విషయంలో ఎప్పుడూ క్లారిటీగానే ఉంటాడు. మనిషిలా చాలా మారాడు.
 
- గత తొమ్మిదేళ్ల నుంచి నాకు శ్రీను ఫ్రెండ్. ఒక్క సినిమా ఆడటానికి, ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఏ ఒక్కరినో నిందించలేం. నాకు శ్రీను బలం, సామర్థ్యం ఏంటో తెలుసు. అస్సలు భయపడలేదు. అన్నపూర్ణ స్టూడియో కాబట్టి.. శ్రీను టాలెంట్ చూపించేందుకు అవకాశం దొరికింది.
 
- భీమవారం స్లాంగ్, అక్కడి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయి. వాటిలో నేను సులభంగా ఇమడగలను. కొత్త పాత్రలు ట్రై చేశాను. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఈ చిత్రంలో భీమవరం, హైద్రాబాద్ నేపథ్యంలో సాగుతుంది.
 
- మార్చి 29న షూటింగ్ చేద్దామని అనుకున్నాం. కానీ మార్చి 23న లాక్డౌన్ వచ్చింది. అలా కథ, స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలి. అందుకే ఈ చిత్రాన్ని మంచి టైం చూసి విడుదల చేస్తున్నాం. పైగా సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలున్నాయి.
 
- నాగ చైతన్య గారు ఈ సినిమా చూశారు. ఆయన చూసినప్పుడు నేను అక్కడ లేను. వేరే షూటింగ్‌లో ఉన్నాను. సినిమా చూశాక డైరెక్టర్‌తో నలభై నిమిషాలు మాట్లాడారట. సినిమా చాలా నచ్చిందని అన్నారట.
 
- మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్‌కు, శ్రీనుకి మంచి బాండింగ్ ఉంది. సినిమా చేయాలని అడిగినప్పుడు.. రెమ్యూనరేషన్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఎంతిస్తే అంత ఇవ్వండి.. నేను ఈ సినిమా చేస్తాను అని అన్నారు. అది చాలా గొప్ప విషయం.
 
- గ్యాంబ్లింగ్ అంటే నాకు నచ్చదు. ఆ ఆటలు నేను ఆడను. కోడి పందెలు చూస్తాను కానీ బెట్టింగ్ పెట్టను. ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతుంది. అక్కడి పండుగ వాతావరణాన్ని చూపిస్తాం. కోడి పందెల్లో ఎన్నో  రకాల కోళ్లు ఉంటాయి. నాకు జంతువులంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో వాడిన కోడిని నాకు అలవాటు అయింది. షూటింగ్ లేదని ఆ కోడి దిగాలుగా ఉంటుందట. దానికి కూడా షూటింగ్ అలవాటు అయింది. తినడం లేదంట. (నవ్వులు)
 
- కెరీర్‌ను ప్లాన్ చేయను. ఏది బాగా నచ్చితే అది చేస్తాను. ఇప్పుడు స్టాండప్ రాహుల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల కానుంది. మాస్ మహారాజా ఈ మధ్యే  షూటింగ్ ప్రారంభమైంది.
 
- నాకు హైద్రాబాద్ ఎలా రావాలో కూడా తెలీదు. అలాంటిది ఇక్కడకు వచ్చాను. పద్నాలుగు సినిమాలు చేశాను. ఇంకో సినిమా రెడీగా ఉంది. మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇంత కంటే గొప్ప అదృష్టం ఇంకేం కావాలి.
 
- స్టాండప్ రాహుల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. మాస్ మహారాజా పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. స్లాంగ్ కూడా కొత్తగా ఉంటుంది.
 
ఓ వెబ్ సిరీస్ చాన్స్ వచ్చింది. నాకు చాలా నచ్చింది. కానీ రెండు సినిమా షూటింగ్‌లు చేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఇక్కడ ఓ సినిమా హిట్ కొట్టిన తరువాత వేరే భాషలో ట్రై చేస్తాను.