సూసైడ్ చేసుకోవాలనుకున్నా... తండ్రి మరణం భయాన్ని పోగొట్టింది : ఏఆర్ రెహ్మాన్
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పాతికేళ్ళ క్రితం తన మనసులో మెదిలాడిన అంశాలను వెల్లడించారు. తనకు 25 యేళ్ళు వచ్చేంత వరకు ఆత్మహత్య చేసుకోవాలన్న భావన పదేపదే వచ్చేదన్నారు.
ఆయన జీవితం ఆధారంగా కృష్ణ త్రిలోక్ రాసిన 'నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్'ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
'నాకు 25 సంవత్సరాలు వచ్చేవరకూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడుతుండేవి. ఎవరికి వారు మనం ఎందుకూ పనికిరాం అని అనుకోవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తాయనిపించేది. నాన్నను కోల్పోవడంతో ఒక్కసారిగా జీవితం శూన్యంగా మారిపోయింది. నా తండ్రి మరణం నాలో భయాన్ని పోగొట్టింది. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ చావు మాత్రం ప్రతి మనిషికి ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు చావుకు ఎందుకు భయపడాలి? అన్న ఆలోచన నాలో ధైర్యం నింపింది' అని దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ చెప్పుకొచ్చారు.
'నాన్న మరణించే క్షణం వరకూ పనిచేస్తూనే ఉన్నారు. నా దగ్గరకు 35 సినిమాల అవకాశాలు వస్తే వాటిలో నేను రెండే సినిమాలకు సంగీతం అందించా. నా పద్దతి చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అవకాశాలు వస్తున్నప్పుడు వినియోగించుకోవాలి. వచ్చిన అవకాశాల్ని వదిలేసుకుంటే ఎలా జీవిస్తావు? అని చాలామంది అనేవారు. 25 ఏళ్ల వయసులో వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోలేను అని చెప్పారు.
పైగా, అలా చేస్తే జీవితానికి సరిపడా తిండి ఒకేసారి తిన్నట్లు అవుతుంది. అందుకే కొంచెం కొంచెం తింటూ మందుకెళ్లాలనుకున్నా. 22 ఏళ్లలోపు నా చదువును పూర్తిచేశా. అందరూ చేసే పనులు చేయకూడదు అనుకున్నాను. అందుకే 'రోజా' సినిమాతో సంగీత దర్శకుడిగా మారాను. ఆ సమయంలో నా కుటుంబం ఇస్లాం మతానికి మారింది. నా అసలు పేరు దిలీప్ కుమార్. మతంలోకి మారాక పాత జ్ఞాపకాలన్నీ వదిలేసినట్టు చెప్పారు.
ముఖ్యంగా, నా అసలు పేరంటే నాకు అస్సలు ఇష్టం ఉండేదికాదు. ఎందుకు ఇష్టంలేదో కూడా ఇప్పటికీ అర్థంకాదు. నా వ్యక్తిత్వానికి ఆ పేరు సూట్ కాదని అనిపించింది. మన మనసు చెప్పేది వినాలని నేను నమ్ముతా. అలా చేసుకుంటూనే సంగీత రంగంలో ఎదిగా. నాలో మార్పు రావడానికి సంగీతమే కారణం' అని వివరించారు.