గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:56 IST)

దేశం కోసం ప్రాణ‌మిద్దామ‌నుకున్నా, కానీ డెస్టినీ ఇలా: హీరో వైష్ణవ్ తేజ్

Vyshav tej, Upeena
`నేను డాక్ట‌ర్ కావాల‌ని యాక్ట‌ర్ అయ్యాను. బిజినెస్‌మేన్ కాబోయి న‌టుడిని అయ్యాన‌ని` చాలామంది నుంచి సినీమా రంగంలో వినిపించే ప‌దాలే. కానీ వున్న‌ది ఉన్న‌ట్లుగా చెబుతూ నిర్మొహ‌మాటంగా దేశం కోసం ప్రాణం ఇద్దామ‌నుకున్నా అంటూ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ అంటున్నాడు. ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా హీరో వైష్ణ‌వ్‌ తేజ్ చెప్పిన ఇంట‌ర్వ్యూ విష‌యాలు.
 
మీ కుటుంబంలో చాలామంది హీరోలు వ‌స్తున్నారు. అలా మీరూ వ‌చ్చారా?
లేదంటి. న‌టుడిగా నాకు ఇంట్రెస్్ట‌లేదు. కాలేజీ త‌ర్వాత నా కెరీర్ డిసైడ్ ఏం చేసుకోవాలో తెలీక నాలో నేను 4 ఏళ్ళు త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డ్డాను. సైంటిస్ట్ అవుదామనుకున్నా. త‌ర్వాత ద‌ర్శ‌కుడు అవ్వాల‌నుకున్నా. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ శ‌క్తి నాకు లేద‌నిపించింది. ఇది కాదని ఫొటోగ్రాఫ‌ర్ అవ్వాల‌నుకున్నా. అందుకోసం కోర్సు కూడా చేశాను. ఆ త‌ర్వాత. వ్యోమగామి అవ్వాలనుకున్నా, 3డి ఏనిమేట‌ర్ కూడా అవ్వాల‌ని ప్ర‌య‌త్నం చేశా. చివ‌ర‌గా.. ఇవేవికాదు.

ఈ ప్రాణాలు దేశం కోసం ఇద్దామ‌నుకున్నా. నా ఐపేడ్‌లో ఆర్మీలో ఎలా అప్ల‌యి చేయాలో తెలుసుకున్నా. ఆ ప్రాసెస్‌లో స‌న్న‌బ‌డ్డాను. మూడు ఫొటోలు ఇన్‌స్‌ట్రాగామ్‌లో పెట్టాను. అవి చూసి ఇద్ద‌రు పిలిచారు. నాకు న‌ట‌న రాదు. మీరు చెబితే దాన్నిబ‌ట్టి చేస్తాన‌న్నాను. కానీ అవి వ‌ర్క‌వుట్ కాలేదు. ఒక‌రోజు అనుకోకుండా ద‌ర్శ‌కుడు బుజ్జిబాబుగారు వ‌చ్చి క‌థ చెప్పారు.

మామ‌య్య‌లా నాకు డాన్స్‌, యాక్ష‌న్ రాదు. క‌నీసం ష‌డెన్‌గా ఏడుపు కూడా రాదు అని చెప్పేశాను. ఈ విష‌యాలు మామ‌య్య‌కు తెలిసింది. ఆయ‌న అన్న మాట నాకు స్పూర్తి నిచ్చింది. ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని గౌర‌వించు. నిన్ను నువ్వు నిరూపించుకో. లేదంటే ఆ త‌ర్వాత నీ ఇష్ట‌మైన ఫీల్డుకు వెళ్ళు అన్నారు. దాంతో కొత్త బ‌లం వ‌చ్చిన‌ట్ల‌యింది.
 
మీ చిన్న మామయ్య పవన్ క‌ళ్యాణ్ ఏమన్నారు?  
నేను సినిమాలనే కెరీర్‌గా ఎంచుకున్నానని తెలిసి ఆయన ఆనందించారు. పవన్ మావయ్య ఉప్పెన ట్రైలర్‌ను చూశారు. ఆయనకు బాగా నచ్చింది. ట్రైలర్ బాగుంది. మంచి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నావు అన్నారు. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు సినిమాను చూపిస్తాను.
 
ఇందులో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశం? 
ఈ కథ నాకు చాలా అద్భుతంగా అనిపించింది . ఈ కథ నా వద్దకు వచ్చినప్పుడు ఇంత గొప్ప సినిమా అవుతుందని నాకు ఖచ్చితంగా తెలియదు. నిజానికి నేను అప్పట్లో చాలా డౌట్లో ఉన్నాను.. కానీ చుట్టూ ఉన్నవారు నాకు చాలా సహాయపడ్డారు. చిరంజీవిగారు కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మామయ్య ప్రొసీడ్ అని చెప్పడంతో ఫుల్ హ్యాపీగా ఈ సినిమా చేశా. ఆయన చెప్పిందే నాకు వేదం. 

Vyshav tej, Kriti setty
ఇందులో జాల‌రిగా చేశారు. అందుకు ఏమైనా శిక్ష‌ణ తీసుకున్నారా?
ఇండస్ట్రీ లోకి రావడానికి ముందు నటనలో శిక్షణ తీసుకున్నాను. అలాగే ఈ సినిమాలోని నా పాత్ర కోసం, ఎందుకంటే ఇందులో నేను ఒక జాలరిలా కనిపించడానికి, అచ్చం నా బాడీ లాంగ్వేజ్‌ను కూడా అలాగే మార్చుకొవడానికి ప్రాక్టీస్ చేశాను. స‌ముద్ర‌తీరంలోని కొంత‌మందిని క‌లిసి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అక్క‌డే వున్నాను. 40 రోజులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను. ప్రీ-ప్రొడక్షన్ కంటే, నేను సెట్స్‌పై చాలా నేర్చుకున్నాను.
 
 విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం?
నిజంగా అయన సూపర్ యాక్ట‌ర్‌, ఒకరకంగా ఆయన ఆశీర్వాదం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఆయన చాలా నిజాయితీగల నటుడు, ఆయన నుండి చాల నేర్చుకున్నాను. అన్నింటికన్నా కూడా ఆయన ప్రవర్తనకు అభిమానిని అయ్యాను. ఆయన ఎప్పుడూ మానిటర్‌ను చూడడు, డైరెక్టర్ చెప్పిందే చేస్తాడు. సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు.
 
జనరల్గా మీకు ఎలాంటి జోనర్స్ అంటే ఇష్టం?  
నాకు యాక్షన్ బాగా ఇష్టం. మెగా హీరోల యాక్షన్ చిత్రాలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌ల సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. అందరి హీరోల సినిమాలు చూస్తాను.
 
దర్శకుడు బుచ్చి బాబు గురించి?
బుచ్చిబాబు నాకు ఒక గురువు, స్నేహితుడు, సోదరుడు. నేను ఇంత బాగా ఈ సినిమా చేసానంటే దానికి ముఖ్య కారణం బుచ్చిబాబు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనకే.

Vyshnav tej, Chiranjeevi
సినిమా చూసిన తర్వాత చిరంజీవి స్పందన ?
నా నటన గురించి ఆయన ఏమంటాడో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూసాను. ఆయన సినిమా చూసిన క్షణం, “సూపర్‌గా చేశావ్ రా’ అన్నారు. అదే నా జీవితంలో నాకు దక్కిన ఉత్తమ అభినందనగా భావిస్తాను. ఆయనకి సినిమా నచ్చింది కాబట్టి, ప్రేక్షకులు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందని నా అభిప్రాయం.
 
కృతిశెట్టి ఎలా న‌టించింది?
ఆమె షూటింగ్‌లో వుండ‌గానే తెలుగు నేర్చేసుకుంది. నేను కూడా త‌మిళ పుస్త‌కాలు తీసుకుని ప్రాక్టీస్ చేశాను. న‌టిగా ఆమె అద్భుత‌మ‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఆమెకు ఆఫ‌ర్లు కూడా వ‌చ్చేశాయి.

మీ మొద‌టి సినిమా కంటే రెండవ‌ది విడుద‌ల కావ‌డం ఎలా అనిపిస్తుంది?
నా మొద‌టి సినిమా క్రిష్ దర్శకత్వంలో చేశాను. అది పూర్త‌యింది. లాక్‌డౌన్ స‌మ‌యం ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఉప్పెన ముందుకు వ‌చ్చింది.