శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (09:21 IST)

మౌనంగా కూర్చోలేం .. మంత్రి కొండా సురేఖకు జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్

jrntr
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతల విడాకుల అంశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా కూర్చోలేమని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. 
 
'కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్రకటనలు చేయడం తీవ్రంగా బాధించింది.
 
ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం మౌనంగా కూర్చోం. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ సహించదు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు' అని తారక్ ట్వీట్ చేశారు.
 
కాగా, నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమా రంగం నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని ఆమె ఆరోపించారు.
 
కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఆరోపించారు. వారితో కలిసి రేవ్ పార్టీలు చేసుకుని, మదమెక్కి... వారి జీవితాలతో ఆడుకున్నారని, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో సురేఖ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.