బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (16:25 IST)

ఆ సీన్లు నిజమా? కాదా? అనేకంటే జనాలకు చేర్చామా? అన్నదే యాత్ర 2 ఉద్దేశం

Jeeva, Mahi V Raghav, Ketaki Narayan
Jeeva, Mahi V Raghav, Ketaki Narayan
దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పై యాత్ర సినిమా వచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా యాత్ర 2 సిద్ధమైంది. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగళవారం ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.
 
మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో నడిపించామన్నది తెలియదు. ఈ టీజర్, ట్రైలర్‌లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు తెలియవు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశాను. 
 
ట్రైలర్‌లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ఉద్దేశం. వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చు. వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని చూపించాం. ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. ఇందులో కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదు. 
 
ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు.. అన్నీ బాగా ఆడాలి.. ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయి. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే.. థియేటర్లు బాగుంటాయి కదా. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి. ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం. మమ్ముట్టి గారు చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను..కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్‌ మాత్రం నిజం’ అని అన్నారు.
 
జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను. ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది. మహి గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారు. 
 
ఇక షాట్ ఓకే చెప్పడంతో నాకు పెద్ద రిలీఫ్‌లా అనిపించింది. నేను జగన్ మోహన్ రెడ్డి గారిలానే కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత నేను మానిటర్ కూడా చూడలేదు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను’ అని అన్నారు.
 
కేతకి నారాయణ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఓ రియల్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇది నా మాతృభాష కాదు. నేను మరాఠీ, హిందీల్లో నటించాను. తెలుగులో ఇది నాకు మొదటి చిత్రం. భారతి గారికి ఓ ఇమేజ్ ఉంది. ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. ఎలాంటి మనిషి.. ఎలాంటి విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారు.. అనే విషయాలను తెలుసుకున్నాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’ అని అన్నారు.