బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (16:29 IST)

పసందైన వినోదాన్ని పంచే నాగశౌర్య "ఛలో" (రివ్యూ రిపోర్ట్)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నాగశౌర్య ఒకరు. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో.. 'కల్యాణ వైభోగమే', 'ఒక మనసు', 'జ్యో అచ్యుతానంద', 'కథలో రాజకుమారి' వంటి పలు

చిత్రం: ఛలో
బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌
నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందాన, నరేష్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: ఉషా ముల్పూరి
విడుదల తేదీ: 02-02-2018
 
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నాగశౌర్య ఒకరు. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో.. 'కల్యాణ వైభోగమే', 'ఒక మనసు', 'జ్యో అచ్యుతానంద', 'కథలో రాజకుమారి' వంటి పలు చిత్రాల్లో నటించి యువ హీరోల్లో సక్సెఫుల్ కథానాయకుడిగా పేరుగడించాడు. 
 
దాదాపు యేడాది విరామం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన చిత్రం 'ఛలో'. దర్శకుడితో కలిసి ఈ చిత్ర కథకు మెరుగులు దిద్దడంతో పాటు, సొంత నిర్మాణ సంస్థలో దాన్ని తెరకెక్కించాడు కూడా. అంతేకాదు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవిని పిలిచి మరీ ఆశీస్సులతో పాటు తన చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీని ఇప్పించుకున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
కథ...
చిన్నప్పటి నుంచి గొడవలంటే అమితంగా ఇష్టపడే హరి(నాగశౌర్య)కి ఎవరినైనా కొట్టాలన్నా, కొట్టించుకోవాలన్నా భలే సరదా. దీంతో కుమారుడి పోరు భరించలేని తండ్రి (నరేష్‌) చిన్నతనంలోనే తమిళనాడులోని తిరుప్పురం అనే ఊరికి పంపించేస్తాడు. అది ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు ప్రాంతం. పైగా, తిరుప్పురంకు, సమీప గ్రామానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోతుంది. అలాంటి ఊరిక కాలేజీలోనే హరి చేరుతాడు. అతను తమిళ వ్యక్తి అనుకొని తమిళ బ్యాచ్‌ అతన్ని వాళ్ల జట్టులో చేర్చుకుంటుంది. అక్కడే కార్తీక(రష్మిక)ను మనసు పారేసుకుని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సైపోతాడు. 
 
అయితే, ఆ అమ్మాయి తమిళ యువతి కావడంతో కుటుంబ పెద్దలను ఒప్పించడం చాలా కష్టమని గ్రహిస్తాడు. చివరకు ఏకంగా రెండు ఊళ్ళనే కలిపేందుకు సిద్ధమైపోతాడు. మరి హరి ఆ రెండు ఊళ్లను కలిపాడా? అసలు హరి పెళ్లి జరిగిందా?, అసలు ఆ రెండు గ్రామాల మధ్య ఉన్న పగప్రతీకారాలేంటి అన్నదే ఈ ఛలో చిత్ర కథ. 
 
గతంలో అనేక చిత్రాల్లో పగప్రతీకాలాతో రగిలిపోయే రెండు ఊర్లు.. చివరకు వచ్చేసారికే కలిసిపోవడం చూశాం. కానీ, ఈ చిత్రంలో కథ ఎలా ఉందన్నది పక్కన పెడితే దాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. హీరో పాత్రను చాలా విభిన్నంగా ఉంది. దాని చుట్టూనే హాస్యాన్ని అల్లాడు. కాలేజీ సీన్లు చాలా కొత్తగా చిత్రీకరించారు. కడుపుబ్బ నవ్విస్తాయి. హీరో - హీరోయిన్‌ల మధ్య సాగిన లవ్‌ ట్రాక్‌ కూడా బాగుంది. ఫస్టాప్‌లో పెద్దగా కథ లేకపోయినా, కామెడీ పాటలతో నడిపించాడు. 
 
ఈ చిత్రం రెండో అర్థ భాగం నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒక లక్ష్యం అన్నది అప్పుడే ఏర్పడుతుంది. అది ఆ రెండు ఊళ్లను కలపడం. కథను మరీ సీరియస్‌గా నడపకుండా వెన్నెల కిషోర్‌ పాత్రను ప్రవేశపెట్టాడు దర్శకుడు. దీంతో కథలో వినోదం డోస్‌ పెరుగుతుంది. ఆ పాత్రను రాసుకున్న విధానంగా కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. మొత్తంమీద దర్శకుడు కథను నడిపిన తీరు చాలా బాగుంది. క్లైమాక్స్ తేలిపోయినప్పటికీ.. కామెడీగా తీసుకుంటే "ఛలో" చిత్రం హిట్ ఖాతాలో చేరినట్టే. 
 
ఇక పాత్రలను ఓసారి పరిశీలిస్తే, నాగశౌర్య హరి పాత్రలో ఇమిడిపోయాడు. ఇక కథానాయిక రష్మికకు మంచి మార్కులే పడతాయి. చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. నాగశౌర్యతో పోటీపడి నటించింది. సత్య, వెన్నెల కిషోర్‌లు బాగా నవ్విస్తారు. అయితే, బలమైన విలనిజం లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. పాటలు అందంగా, వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు వెంకీ కుడుముల రాసుకున్న సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. వెన్నెల కిషోర్‌తో చాలా పంచ్‌లు పేల్చారు. తొలి చిత్రమే అయినా, తడబాటు లేకుండా సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.