బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (15:42 IST)

యూత్ టార్గెట్ గా తీసిన పర్‌ఫ్యూమ్ చిత్రం ఎలా ఉందంటే ! రివ్యూ

Chenag, Prachi Thacker
Chenag, Prachi Thacker
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన చిత్రం పర్‌ఫ్యూమ్  జే.డి.స్వామి దర్శకత్వంలో  జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
 
కథ
స్మెల్ అబ్‌సెషన్ వ్యాధితో బాధపడే సైకో వ్యాస్ (చేనాగ్)  అమ్మాయి వాసన వస్తే చాలు ఓ రకంగా మారిపోతాడు. అమ్మాయిలను వాసన చూస్తూ ఇబ్బందిపెడుతుంటాడు. ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. వెంటనే ఆ సైకోని పట్టుకోకపోతే ప్రమాదకరమైన కిల్లర్‌గా మారుతాడని ఏసీపీ దీప్తి (అభినయ) భావిస్తుంటారు. అదే టైంలో వ్యాస్ కోసం లీలా (ప్రాచీ థాకర్) వెతుకుతుంటుంది. ఓ సారి వ్యాస్ కనిపించడంతో లిప్ కిస్ ఇచ్చేస్తుంది. దీంతో వ్యాస్ ఆమె మైకంలోకి వెళ్లిపోతాడు. ఆమె వివరాలు కనుక్కుని వెళ్తాడు. అందరి ముందు ముద్దు పెట్టేస్తాడు. దీంతో పెద్ద గొడవ అవుతుంది. వ్యాస్‌ను లీలా అవమానపరుస్తుంది. లీలా మీద పగతీర్చుకునేందుకు ఆమెను కిడ్నాప్ చేస్తాడు వ్యాస్. ఆ తరువాత వ్యాస్ ఏం చేశాడు? అసలు లీలా బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వ్యాస్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? వ్యాస్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? చివరకు వ్యాస్ లీలా కథ ఏం అవుతుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
 
 
సమీక్ష:
స్మెల్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. గతంలో అరుంధతి లో సోనూసూద్ బిహేవియర్ అలానే ఉంటుంది. ఈ సినిమా చుస్తే అదే గుర్తుకు వస్తుంది. అయితే పరిమిత బడ్జెట్ తో తీసిన ఈ సినిమా యూత్ టార్గెట్ గా ఉంది. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ బాగా చూపించాడు. టీచర్ చేసిన తప్పుడు ప్రచారం  బాలిక జీవితం పై ఎలా పడింది అనే సందేశం అంతర్లీనంగా ఉంది. పిల్లల పెంపకం గురించి, చాష్త్ ఫీలింగ్ గురించి కూడా చూపారు.  
 
వ్యాస్ పాత్రలో చేనాగ్ చక్కగా నటించాడు. తెరపై ఓ కొత్త హీరో అనేలా ఎక్కడా అనిపించలేదు. మొదటి సారి తెరపై కనిపిస్తే కొంత మంది నటించడలో తడబడుతుంటారు. కానీ చేనాగ్ మాత్రం అవలీలగా నటించేశాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఇది వరకు దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం కూడా తోడవ్వడంతో తెరపై అవలీలగా నటించేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఓకే అనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో నాచురల్‌గా నటించాడు. లీల కారెక్టర్‌లో ప్రాచీ పర్వాలేదనిపిస్తుంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఏసీపీ దీప్తిగా అభినయ కనిపించినంతలో మెప్పించింది. బాబా, తాజ్ పాత్రలు బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.
 
కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినప్పుడు జనాలకు కనెక్ట్ అవ్వడం కాస్త కష్టంగానే అవుతుంది. ఆ కాన్సెప్ట్‌కు, చూపించిన ఎమోషన్స్‌కు ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసినప్పుడే దర్శకుడు సక్సెస్ అయినట్టు. ఈ పర్‌ఫ్యూమ్ సినిమాకు ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. హీరో బాధను ఆడియెన్స్ ఫీలయ్యేలా కనిపిస్తోంది. అయితే ఆ ఎమోషన్‌ను బోర్ కొట్టించకుండా తీసుకెళ్లడంతో దర్శకుడు కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది.
 
ఫస్ట్ హాఫ్ చూసిన తరువాత రెండో భాగం మీద మరింతగా అంచనాలు పెరుగుతాయి. హీరో ఏం చేస్తాడా? అని అంతా అనుకుంటారు. కానీ ఊహకు భిన్నంగా కథనం సాగుతుంది. ద్వితీయార్దంలో హీరో పాత్ర తీరు పూర్తిగా మారుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్ అస్సలు ఊహించలేరు. ఫ్లాష్ బ్యాక్ సీన్లు బాగుంటాయి. హీరోకి ఆ సమస్యకి ఉన్న నేపథ్యాన్ని చక్కగా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు బాగున్నాయి.
 
సాంకేతికంగా చూసుకుంటే.. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు గుర్తుండిపోతాయి. నగ్న సత్యాలు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కెమెరావర్క్ బాగుంది. నిడివి సమస్యగా అనిపించదు. సాంకేతిక విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టుగా కనిపిస్తుంది. సందేశం తో పాటు ప్రేమ ఘాడత కూడా చూపించాడు. 
 
రేటింగ్: 2.5/5