గురువారం, 23 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2025 (08:59 IST)

సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. - షరాఫ్ గ్రూపుకు సీఎం బాబు విజ్ఞప్తి (Video)

sharaf - babu
దుబాయ్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి పెట్టుబడిదారులను కలుస్తూ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తున్నారు. వీరిలో ఒకరు షరాఫ్ గ్రూపు అధినేత షరాఫుద్దీన్ షరాఫ్‌ కూడా ఉన్నారు. ఆయనతో బాబు కీలక భేటీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సన్ రైజ్ ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యతపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
హింద్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా షరాఫ్ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలో లాజిస్టిక్స్ పార్కులు అభివృద్ధి చేస్తోందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రైల్వే, పోర్ట్ అనుసంధానం కలిగిన ప్రాంతాల్లో గిడ్డంగులు నిర్మించేందుకు ఆసక్తి చూపిందని గుర్తుచేశారు. 
 
'లాజిస్టిక్స్‌పై 14 శాతం ఖర్చు జరుగుతోంది. దీన్ని 8-9 శాతానికే తగ్గించాలన్నదే లక్ష్యం. ఇందుకోసం పోర్టులు, హైవేలు, రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అవసరమైతే పాలసీల్లో మార్పులు చేస్తాం' అని షరాఫ్ గ్రూపు అధినేతకు స్పష్టం చేశారు. 
 
అలాగే, వచ్చే నెల 14, 15వ తేదీల్లో రెండు రోజుల పాటు పారిశ్రామిక, పెట్టుబడిదారుల సదస్సుకు హాజరుకావాలని షరాఫ్ గ్రూపు ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా ఆ గ్రూపు ప్రతినిధులు స్పందిస్తూ, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని, ఏపీకి తప్పనిసరిగా వస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. 
 
కాగా, 1960లో షరాఫ్ గ్రూప్ ఒక సాధారణ షిప్పింగ్ ఏజెన్సీగా ప్రారంభమైంది. నేడు 62 దేశాల్లో కార్యకలాపాలతో 11,000 మంది ఉద్యోగులతో.. దుబాయ్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్, లాజిస్టిక్స్, రిటైల్, టూరిజం, ఐటీ, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, మానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విస్తరించింది. ముఖ్యంగా లాజిస్టిక్స్ రంగంలో ఈ కంపెనీ ప్రత్యేక నైపుణ్యంతో ముందంజలో ఉంది.