సైంటిఫిక్ థ్రిల్లర్ గంధర్వ రివ్యూ రిపోర్ట్
"గంధర్వ'' సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అఫ్సర్ దర్శకత్వంలో సుభానీ అబ్దుల్ నిర్మించిన ఈ సినిమా సురేశ్ కొండేటి నిర్మాణ సారధ్యంలో శుక్రవారం జనం ముందుకు వచ్చింది గంధర్వ. ఇదో సోల్జర్ కథ.
వాల్తేర్‌కు చెందిన అవినాశ్ ఆర్మీలో పనిచేస్తుంటాడు. పెద్దలు చూసిన అమూల్య (గాయత్రి సురేశ్) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. భార్య కాళ్ళ పారాణి ఆరకముందే… ఇండో-పాక్ వార్ లో పాల్గొనాల్సిందిగా పై అధికారుల నుండి అతనికి పిలుపు వస్తుంది. హుటాహుటిన బోర్డర్ కు బైలు దేరతాడు.
బంగ్లా విముక్తి పోరాటంలో కెప్టెన్ అవినాశ్ మరణించినట్టు అధికారులు చెబుతారు. అయితే అది వాస్తవం కాదు. యుద్థ సమయంలో ఓ లోయలో పడిపోయిన అవినాశ్ యాభై ఏళ్ళ పాటు కోమాలో ఉండి 2021లో తిరిగి స్పృహలోకి వస్తాడు.
చిత్రంగా అతని వయసు మాత్రం పెరగదు. యువకుడిగానే ఉంటాడు. తన వాళ్ళను వెతుక్కుంటూ వచ్చిన అవినాశ్‌కు సొంత వూరిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్ర కథ.
గతంలో ప్రముఖ రచయిత ఎన్. ఆర్. నంది "సిగ్గు సిగ్గు" పేరుతో ఓ నవల రాశారు. అందులో కథానాయకుడు స్వతంత్ర సమరయోధుడు. కొన్ని దశాబ్దాల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత స్పృహలోకి వస్తాడు.
అన్ని విధాలుగా కలుషితమైన ఈ సమాజాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. ఈ సినిమా చూస్తుంటే కొందరికి ఆ నవల గుర్తొచ్చే ఆస్కారం ఉంది. అలానే ఆ మధ్య వచ్చిన రవితేజా "డిస్కో రాజా"లోని హీరో క్యారెక్టర్ గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన మహేశ్ బాబు "నాని"లోని కొన్ని సన్నివేశాలూ జ్ఞప్తికి వస్తాయి.
ఇలాంటి నమ్మశక్యం కాని కథను డీల్ చేయాలంటే ముందు దర్శకుడికి కన్విక్షన్ ఉండాలి. ఈ అంశానికి సంబంధించి లోతైన పరిశోధన చేయాలి. థియేటర్‌లోని ప్రేక్షకులకు ఇలా జరిగే ఆస్కారం ఉందనే నమ్మకం కలిగించాలి. ఆ విషయంలో దర్శకుడు అఫ్సర్ సక్సెస్ అయ్యారు.
సందీప్ మాధవ్ ఆర్మీ జవాన్‌గా బాగానే నటించాడు. అయితే అతని వాయిస్ ఆ పాత్రకు అంతగా నప్పలేదు. మరింత గంభీరంగా ఉండాల్సింది. మలయాళ భామ గాయత్రి సురేశ్‌కు తెలుగులో ఇది మూడో సినిమా. నటిగా ఫర్వాలేదనిపించింది. సీతల్ భట్ గ్లామర్‌కే పరిమితమైంది.
సాయికుమార్, సురేశ్, బాబూమోహన్ వంటి సీనియర్స్ నటించడం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇటీవల తెరపైన కూడా కనిపిస్తున్న డైరెక్టర్ వీరశంకర్ ఇందులోనూ ఓ కీలక పాత్ర పోషించారు.
ప్లస్ పాయింట్స్
సైంటిఫిక్ థ్రిల్లర్ కావడం
సీనియర్స్ యాక్టింగ్
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
మైనస్ పాయింట్స్
తేలిపోయిన పతాక సన్నివేశం
పండని ఎమోషన్ సీన్స్