నటీ నటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, శ్రీలీల, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళి శర్మ, నవీన్ చంద్ర, చంద్రికా రవి, అజయ్ ఘోష్, సప్తగిరి, శ్రీనివాసా రెడ్డి తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఎడిటర్: నవీన్ నూలి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కోరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్, శంకర్, మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
నందమూరి బాలకష్ణ డ్యూయల్ రోల్ చేసిన సినిమా వీర సింహారెడ్డి. అఖండ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
వీర సింహా రెడ్డి (బాలయ్య) రాయలసీమకి దేవుడు లాంటి మనిషి. పులిచర్ల ప్రాంతానికి అండగా నిలబడుతూ..రేపటి తరం బాగు కోసం తనే కత్తిపడతాడు. ఊరిలో జనాల్ని ఫ్యాక్షన్ నీడన బతకనీయకుండా ఫ్యాక్టరీలు కట్టి కొత్తతరానికి భవిష్యత్‌కు బాటలు వేస్తాడు. ఇది సహించని పక్క ఊరి ఫ్యాక్టనిస్టు దునియా విజయ్ తండ్రి కక్ష కడతాడు. అతన్ని వీర సింహారెడ్డి చంపేస్తాడు. ఆ తర్వాత తన తండ్రిని చంపినందుకు దునియా విజయ్ పగ పెంచుకుని వీర సింహారెడ్డి కోసం కాపుకాస్తాడు.
ఇలా జరుగుతుండగా వీర సింహారెడ్డి సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) తన అన్నను చంపేస్తుంది. ఇది జయసింహారెడ్డి (బాలయ్య) వున్న ఇస్తాంబుల్‌లో జరుగుతుంది. చనిపోతూ వీరసింహారెడ్డి నా చెల్లెలు జాగ్రత్త అంటాడు. ఆ తర్వాత అసలు ఏమి జరిగింది? రాయలసీమ నుంచి ఇస్తాంబుల్ ఎందుకు వచ్చారు? అనే వివరాలు తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)ను అడుతుతాడు. అప్పుడు చెబుతున్న కథే మిగిలిన సినిమా. ఇందులో ఈషా (శ్రుతి హాసన్)తో లవ్. తండ్రిని హత్య చేసిన అత్త కుటుంబాన్ని జయసింహ ఏం చేశాడు? అన్నది సినిమా.
విశ్లేషణ:
రాయలసీమ పగ ప్రతీకారాలతో బోలెడు సినిమాలు బాలకృష్ణతో వచ్చాయి. అయితే అందులో ద్విపాత్రాభినయం చేసిన రోల్స్ వున్నాయి. సింహ సినిమాలో పెద్ద బాలయ్య చనిపోయినట్లే ఇందులోనూ చనిపోతాడు. ప్రజలకోసం మంచి కోసం దేనికైనా తెగించే పాత్ర బాలయ్యది. అందులో వీర సింహారెడ్డి పాత్రలో జీవించేశాడు. పౌరుషం, డైలాగ్, ఫైట్స్, అన్నీ ఫ్యాన్స్‌కు ఫిదా చేస్తాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగింది సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర. క్లయిమాక్స్‌లో ఆమె చెప్పే డైలాగ్స్ ఎమోషన్ కంటతడి పెట్టిస్తాయి. ఇది మినహా మిగిలిన కథంతా వయెలెన్స్ ఎక్కువ. తలలు లేచిపోతుంటాయి. బాలయ్య సినిమా అంటే కత్తులు కటారులు, బాంబ్ బ్లాస్టులు అన్నట్లుగానే ఈ సినిమా వుంది.
హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు న్యాయం చేసింది. వీర సింహారెడ్డి భార్యగా హనీ రోజ్ బాగుంది. విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ తన వైల్డ్ నటనతో మెప్పించాడు. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
ఇక ఫ్యాక్షన్ సినిమాకు కథ అనేది పెద్దగా అక్కరలేదు. పాత సినిమాల్లోని పాయింట్లను అటూ ఇటూ తిప్పి దర్శకుడు మలిచినట్లుగా వుంది. జయసింహారెడ్డి పాత్ర స్లో నేరేషన్‌తో, కొన్ని చోట్ల ఈ పవర్ ఫుల్ మాస్ డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.
ఏ సినిమాకైనా కంటెంట్ ముఖ్యం. అది కేవలం చెల్లి పాత్రలో అది కూడా పొరపాటుగా అన్నను ఊహించుకుని చంపేస్తుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలతో సినిమా రేంజ్ ను కొంత తగ్గించాడు. మొత్తానికి సినిమా నిండా యాక్షన్ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ యాక్షన్ ఉపయోగపడలేదు. అలాగే, కథలోని మెయిన్ ఎమోషన్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు.
సాంకేతికపరంగా చూస్తే, ప్రతి సీన్‌ను నేపథ్య సంగీతం గందరగోళంగా వుంది. థమన్ అఖండకు బాక్స్‌లు బద్దలయ్యాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అన్నాడు. కానీ సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా రొదలు ఎక్కువయ్యాయి. బాలయ్య వస్తుంటే యాక్షన్ చేస్తుంటే సౌండ్ మరీ ఎక్కువగా వుంది. సాహిత్యపరంగా రామజోగయ్య శాస్త్రి రాసిన.. చీమ..చీమ.. జైబాలయ్య, బావ మనోబావాలు దెబ్బతిన్నాయి. వంటి పాటలు బయట బాగున్నాయి. కానీ సినిమాలో పెద్దగా కిక్ ఇవ్వలేదు.రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. రామ్ లక్ష్మణ్ యాక్షన్ సీన్స్ స్టయిలిష్‌గా వున్నాయి. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
రాయలసీమ పగలు ఇస్తాంబుల్ వరకూ రావడం.. సినిమాటిక్‌గా ఉంది. బాలయ్య సినిమాలంటే సామాజిక అంశాలు వుంటే బాగుంటుంది. రాయలసీమను మార్చాలనే కథ రొటీన్. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలపై సెటైర్‌గా డైలాగ్‌లు వున్నాయి. మంచి వాడని పిచ్చివాళ్లు గెలిపించారు. ఏది పడితే అది జి.ఓ. అంటే కుదరదు. నా జి.ఓ. సెపరేట్ అంటూ కొన్ని సందర్భానుసారంగా వున్నాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమానే సగటు ప్రేక్షకుడికి ఎంత మేరకు నచ్చుతుందో ముందు ముందు తెలియాలి.