ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (16:55 IST)

కొత్తదనంలేని విజయ్ గోట్ - సమీక్ష

Vijay G O A T
Vijay G O A T
నటీనటులు: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్ జీ
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నుని, సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజ, నిర్మాతలు : కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పత్తి సురేష్, దర్శకుడు: వెంకట్ ప్రభు
 
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలంటే తెలుగులోనూ తగిన ఫ్యాన్స్ వున్నారు. తుపాకి సినిమాతో పేరు తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత పలు సినిమాలు తెలుగులో విడుదలచేస్తూ వచ్చారు. తాజాగా తమిళంలో నటించిన ఆయన సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” ఈరోజే తెలుగులోనూ విడుదలైంది. మరి అది ఎలా వుందో చూద్దాం.
 
కథ :
గాంధీ (విజయ్ జోసెఫ్) భారత దేశపు స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. ఓ మిషన్ మీద కెన్యాలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఆపరేషన్ లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్ (మైక్ మోహన్) మట్టుబెడతాడు. అనంతరం మరో మిషన్ మీద వేరే దేశానికీ కుటుంబం భార్య అను (స్నేహ) తన కొడుకు జీవన్ (విజయ్)తో కలిసి ట్రిప్ కి వెళ్తాడు. అక్కడ ఫ్యామిలీపై ఓ ముఠా ఎటాక్ చేసి కొడుకు జీవన్ ను చంపేస్తుంది. కానీ కొంతకాలానికి జీవన్ చనిపోలేదని తెలుస్తుంది. తండ్రి దగ్గరకు వచ్చిన జీవన్ పూర్తిగా మారిపోతాడు.  తండ్రినే చంపాలను ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఇది పూర్తిగా విజయ్ వన్ మేన్ షో కథ. రెండు పాత్రలలో విజయ్ నటించి మెప్పించాడు. కొంత వరకు ఈ కథ గతంలో విజయ్ చేసిన చిత్రాల తరహాలో వుంటుంది. క్లయిమాక్స్ లో వచ్చే సన్నివేశాలు రజనీకాంత్ జైలర్ ను తలపింపజేస్తాయి. ఇందులో భారీ తారాగణం వుంటుంది. ఈమధ్య మల్టీస్టారర్ చిత్రాల కథలు తరహాలో ఈ చిత్ర కథ వుంది. ప్రభుదేవా, జయం రవి, స్నేహ, ప్రశాంత్ లు తమ పాత్రల్లో ఇమిడిపోయారు.
 
మీనాక్షి చౌదరి తన గ్లామర్ షోతో అలరిస్తే, ఐటం సాంగ్ లో తమన్నా నటించింది. విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్న సందర్భంగా పలు రాజకీయ నేపథ్య డైలాగ్ లు వున్నాయి. అక్కడక్కడా మంచి హై మూమెంట్స్, విజయ్ మార్క్ డైలాగ్స్ ఇంకా క్లైమాక్స్ లో చెన్నై ముంబై మ్యాచ్ కామెంట్రీతో విజయ్ రోల్స్ ని హైలైట్ చేస్తూ చూపించిన సీన్స్ ఫ్యాన్స్ ని అలరిస్తాయి. 
 
దర్శకుడు వెంకట్ ప్రభు ఎంచుకున్న కథలో పలు సినిమాలు గోచరిస్తాయి. నిడివి బాగా పెద్దది కావడంతో చాలా వరకు సినిమా సాగదీతగా అనిపిస్తుంది. మొదటి భాగం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఆ భాగంలో కొన్ని తెలుగు సినిమాలు  గుర్తొస్తాయి కానీ పోస్ట్ క్లైమాక్స్ హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ ని తలపిస్తుంది.
 
పైగా చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సిల్లీగా దర్శకుడు చెప్పడం ఒకరకంగా సరైన కసరత్తు లేకుండా చేసినట్లుంది. తెలుగులో పెద్ద హీరోల చిత్రాల్లో కథ, కథనం ఊహించని మలుపులతో వుంటాయి. కానీ విజయ్ సినిమా తమిళ ప్రేక్షకులను ద్రుష్టిలో పెట్టుకుని తీసినట్లుగా వుంది. మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యత లేదు. చాలా సీన్స్ ఊహాజనితంగానే అనిపిస్తాయి.
 
విజయ్ అగ్రహీరో గనుక నిర్మాణ విలువలు  బాగున్నాయి.  ఎడిటింగ్ పరంగా కొంత తగ్గించాల్సి వుంది.  కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ వి ఎఫ్ ఎక్స్ వర్క్ చాలా వీక్ గా కనిపిస్తాయి. యువన్ సాంగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి. నిమాటోగ్రఫీ బాగానే ఉంది.
 
నేటి ట్రెండ్ కథల్లోనూ హీరో యిజంలో సరికొత్తగా కోరుకుంటుంటారు. అవి ఇందులో లోపించాయి. హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ కాన్సెప్ట్ ని తెలివిగా విజయ్ కు సూటయ్యేలా దర్శకుడు చేశాడు. దాంతో నేటివిటీ కాస్త దెబ్బతింది. ఈమధ్య హీరోకంటే విలనిజం వున్న పాత్రలు హైలైట్ అవుతున్నాయి. అలా విజయ్ సెకండ్ రోల్ పైనే ఎక్కువ దర్శకుడు శ్రద్ధ పెట్టాడని చెప్పాలి.  స్క్రీన్ ప్లే డిజప్పాయింట్ చేస్తుంది.
రేటింగ్ : 2.5/5