''నోటా''కు డిపాజిట్ దక్కలేదట.. తమిళంలో అర్జున్ రెడ్డి తొలి సినిమా అంతేనా?
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల ద్వారా హిట్ టాక్‌తో యూత్ మధ్య క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల ద్వారా హిట్ టాక్‌తో యూత్ మధ్య క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. విజయ్ దేవరకొండ తొలి తమిళ సినిమా నోటా. తమిళ రాజకీయాలు, రాజకీయ వేత్తలను ఎద్దేవా చేసే రీతిలో ఈ సినిమా వుంటుందని కోలీవుడ్ సినీ ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూశారు. వారి అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా వుందా లేదా అనేది రివ్యూ రిపోర్ట్ ద్వారా చూద్దాం..
కథలోకి వెళ్తే..
ముఖ్యమంత్రి నాజర్‌పై ఓ కేసు వుండటంతో ఉన్నట్టుండి రాత్రికి రాత్రే అతని కుమారుడైన విజయ్ దేవరకొండను సీఎం చేస్తారు. లండన్ రిటర్న్ అయిన విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి చేసే పని గురించి తెలియదు. కానీ ఓ కేసులో ఇరుక్కుపోయిన నాజర్ కోర్టు తీర్పుతో జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత జరిగే అనూహ్య పరిణామాల వల్ల తలపట్టుకునే విజయ్ దేవరకొండ.. ఆటవీకంగా దొరికిన సీఎం పదవిని సీరియస్‌గా తీసుకుని రాజకీయాలను ఓ ఆటాడుకుంటాడు. ఆ తర్వాత జరిగే చదురంగ ఆటే నోటా సినిమా కథ.
కోలీవుడ్ టాప్ హీరోలు అజిత్, విజయ్, సూర్యకు పోటీని ఏర్పరిచే రీతిలో తొలి సినిమాతో మాస్ హీరోగా అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. తమిళం తెలియకపోయినా.. సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకుని శభాష్ అనిపించుకున్నాడు. మీడియాను బెదిరించడం, సీఎం అయిన తర్వాత వున్నట్టుండి తీసుకున్న నిర్ణయాల్లో తన నటనను కనబరిచాడు.
ఇక ఈ సినిమా హీరోయిన్ మెహ్రీన్‌కు పెద్దగా పనేంలేదు. అయితే మరో హీరోయిన్‌గా సంజన క్యారెక్టర్.. ఇప్పుడున్న మహిళా రాజకీయ నేతల ఛాయలను ఉట్టిపడేలా చేసింది. మహిళా రాజకీయ నేతగా సంజన నటన అదరగొట్టింది. సీఎం విజయ్‌కి చాణక్యుడిగా, రాజకీయాలు నేర్పించే గురువుగా, సీనియర్ జర్నలిస్టుగా సత్యరాజ్ నటించాడు. మేకప్ లేకుండా సత్యరాజ్ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజకీయ నాయకుడిగా నాజర్ క్యారెక్టర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎస్.ఎస్ భాస్కర్ కొన్ని సన్నివేశాల్లో కనిపించినా.. నటనా పరంగా అదరగొట్టాడు.
శ్యామ్ సి.ఎస్ సంగీతంలో పాటలు సుమారుగా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపడేలా వుంది. తొలి రెండు పాటు, కరుణాకరన్, యాషికా సన్నివేశాలను ఎడిటర్ దయాదాక్ష్యిణ్యాలకు పోకుండా కట్ చేసివుంటే బాగుండేది. వీరిద్దరి క్యారెక్టర్లు సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండా వున్నాయి. దర్శకుడు ఆనంద్ శంకర్ ఓ సస్పెన్స్ రాజకీయ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడంలో విఫలమయ్యాడు.
చెన్నై వరదలు, కూవత్తూరు రిసార్ట్, స్టిక్కర్ రాజకీయాలు, ఆస్పత్రిలో అమ్మ వంటి సన్నివేశాలకు బదులుగా ప్రస్తుత రాజకీయ నాయకులను టార్గెట్ చేసి పలు కామెడీ సీన్లను పండించి వుండవచ్చు. ఒక సీఎం గోడదూకి.. స్నేహితులతో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లడం, భారీ బందోబస్తు నడుమ సీఎం అయిన విజయ్ ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటి నుంచి తప్పించుకునే సన్నివేశాల్లో ఏమాత్రం లాజిక్ లేదు. ఇలాంటి సన్నివేశాలు నోటాలో చాలానే వున్నాయి. ఎ.ఆర్ మురుగదాస్‌ను ఓ సీన్‌లో చూపించి.. దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపెట్టినా.. మొత్తానికి నోటాకు డిపాజిట్ దక్కలేదన్నదే నిజం.
రేటింగ్.. 2.25/5