మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 జూన్ 2018 (19:40 IST)

శభాష్ షకలక శంకర్... 'శంభో శంకర'లో హీరోగా చెలరేగాడు... రివ్యూ రిపోర్ట్(Video)

శంభో శంకర నటీనటులు : శంకర్‌, కారుణ్య చౌదరి, అజయ్‌ ఘోష్‌, శివన్నారాయణ, తోట ప్రసాద్‌ తదితరులు. సినిమాటోగ్రఫర్‌ : రాజశేఖర్‌, సంగీతం : సాయి కార్తిక్‌, ఎడిటర్‌ : చోటా.కె.ప్రసాద్‌, స్క్రీన్‌ ప్లే : ఎన్‌. శ్రీధర్‌. నిర్మాతలు : వై.రమణా రెడ్డి, సురేష్‌ కొండేట

శంభో శంకర నటీనటులు : శంకర్‌, కారుణ్య చౌదరి, అజయ్‌ ఘోష్‌, శివన్నారాయణ, తోట ప్రసాద్‌ తదితరులు. సినిమాటోగ్రఫర్‌ : రాజశేఖర్‌, సంగీతం : సాయి కార్తిక్‌, ఎడిటర్‌ : చోటా.కె.ప్రసాద్‌, స్క్రీన్‌ ప్లే : ఎన్‌. శ్రీధర్‌. నిర్మాతలు : వై.రమణా రెడ్డి, సురేష్‌ కొండేటి, దర్శకత్వం : ఎన్‌. శ్రీధర్‌.
 
హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న షకలక శంకర్‌ హీరోగా మారి శంకర్‌ పేరుతో చేసిన చిత్రం 'శంభో శంకర'. స్నేహితుడు ఎన్‌. శ్రీధర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
కథ :
అంకాలమ్మ పల్లెను ఆ ఊరి ప్రెసిడెంట్‌ (అజయ్‌ ఘోష్‌) దోచుకుతింటుంటాడు. ఆ ఊరి రైతు పెద్ద కొడుకు రవి ఫారెస్ట్‌ ఉద్యోగి. రెండో కొడుకు శంకర్‌ (శంకర్‌) ఊరిలో ఎవరికి సమస్య వచ్చినా తనదిగా భావించి ప్రెసిడెంట్‌కు ఎదురుతిరుగుతాడు. దాంతో ప్రెసిడెంట్‌ అతన్ని అడ్డు తొలగించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కనీసం తాను పోలీసు అయితే ఊరిని బాగుచేస్తానని అనుకుంటాడు. సెలక్షన్‌లో డిస్‌క్వాలిఫై అవుతాడు. ఇక తన గారాల చెల్లెల్ని ఊరి ప్రెసిడెంట్‌ కొడుకు పాడు చేస్తే అతడిని చంపేస్తాడు శంకర్‌. సి.ఐ. వచ్చి స్టేషన్‌కు తీసుకెళతాడు. అక్కడ నుంచి తనెలా తప్పించుకున్నాడు? ఊరికి తననుకున్నట్లు బాగుచేయగలిగాడా? అనేదే సినిమా.
 
విశ్లేషణ:
నిన్న మొన్నటి వరకు హాస్య నటుడిగా కనిపించిన శంకర్‌ను ఒక్కసారిగా హీరోగా చూడటం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. బరువు తగ్గి, బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్న శంకర్ తన పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు. పెద్దపెద్ద డైలాగులను చెబుతూ, మంచి డ్యాన్సులు, ఫైట్స్‌ చేస్తూ సహజమైన నటనను కనబర్చి తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు. అయితే హీరోగా నటించాలంటే అందుకు తగిన కథను ఎన్నుకోవాలి. తనకంటూ ఒక మేనరిజం ఏర్పర్చుకోవాలి. అలా కాకుండా కేవలం పవన్‌ కళ్యాణ్‌పై వున్న అవ్యాజమైన ప్రేమను ప్రతి సన్నివేశంలోనూ కనబర్చాడు. ఇంటిముందు ఏకంగా దేవుడుగా పూజించే శివుడి కటౌట్‌ ఫేస్‌ను పవన్‌ కళ్యాణ్‌ ఫేస్‌గా మార్చేసి దేవుడిగా పూజించడం ఆయనపై వున్న ప్రేమకు తార్కాణంగా చూపించాడు. 
 
కోస్తాంధ్రాలో పవన్‌ అభిమానులు అలానే పూజిస్తున్న సందర్భాలున్నాయి. అయితే సినిమాపరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకుని మరో రకంగా చూపిస్తే బాగుండేది. ప్రీ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌‌ కూడా బాగుంది. చాలా చోట్ల శంకర్‌లోని నటుడు బాగా ఎలివేట్‌ అయ్యాడు. హీరోయిన్‌ కారుణ్య చౌదరి, శంకర్‌ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. పాటలు చూడటానికి, వినడానికి కొంతమేర బాగున్నాయి.
 
దర్శకుడు ఎన్‌. శ్రీధర్‌ కథలో శంకర్‌ పాత్రను బాగానే డిజైన్‌ చేసుకున్నారు కానీ కథనాన్ని సరిగ్గా రాసుకోలేకపోయారు. కొన్ని బోర్‌ కొట్టే అనవసరమైన సన్నివేశాలు ఉన్నా మొదటి అర్థభాగం వరకు ఫర్వాలేదనిపించిన స్క్రీన్‌‌ప్లే సెకండాఫ్‌కు వచ్చేసరికి రొటీన్‌ అయిపొయింది. ఇక హీరో తన కొడుకుని చంపినా ప్రతి నాయకుడిలో పెద్దగా చలనం కనబడకపోవడం, ఒక్కసారిగా పరిస్థితులన్నీ హీరోకు అనుకూలంగా మారిపోవడం, కీలక సన్నివేశాలు కొనసాగింపు లేకుండా చకచకా ముగిసిపోవడం నాటకీయంగా మారిపోయింది. మిగిలిన పాత్రలు పరిమిధి మేరకే నటించారు.
 
దర్శకుడు ఎన్‌. శ్రీధర్‌ రాసిన భావోద్వేగపూరితమైన కొన్ని ఫ్యామిలీ సీన్స్‌, హీరో ఎలివేషన్‌ సన్నివేశాలు తప్ప సినిమాలో ఎంజాయ్‌ చేయడానికి పెద్దగా స్కోప్‌ దొరకలేదు. సంగీత దర్శకుడు సాయి కార్తిక్‌ అందించిన పాటల సంగీతం, బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌ కొంత మెప్పించాయి. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. శంకర్‌ను స్క్రీన్‌ మీద బాగానే చూపించారాయన. ఎడిటర్‌ చోటా.కె.ప్రసాద్‌ ఫస్టాఫ్‌ను కొంత ట్రిమ్‌ చేసి ఉండాల్సింది. నిర్మాతలు వై.రమణా రెడ్డి, సురేష్‌ కొండేటిలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
అయితే శంకర్‌ హీరోగా నటనతో, డ్యాన్సులతో, ఫైట్స్‌తో నిరూపించుకోగలడనేందుకు నిదర్శనంగా ఈ చిత్రం నిలుస్తుంది. తను కామెడీ ఆర్టిస్టు అయినా సినిమాలో ఇంకాస్త హాస్యం వుండేలా జాగ్రత్తలు తీసుకుని వుంటే మరింత ఆకట్టుకునేది. ఈ చిత్రం శంకర్‌ను స్క్రీన్‌ మీద హీరోగా చూడాలనుకునే వాళ్లకు మాత్రం కొంత నచ్చుతుంది.