శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (20:01 IST)

'కన్నుల్లో నీ రూపమే' నిజమైన ప్రేమికులు ఇలాగే వుంటారు.. రివ్యూ రిపోర్ట్

కన్నుల్లో నీ రూపమే మూవీ నటీనటులు: నందు, తేజస్విని ప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, షిఫ్‌ వెంకట్‌ తదితరులు; సాంకేతిక సిబ్బంది: సంగీతం: సాకేత్‌ కొమండూరి, నిర్మాత భాస్కర్‌, రచన, కథనం, దర్శకత్వం: బిక్స్‌ (బిక్షపతి). గాయకుడి నుంచి నటుడిగా ఎదిగిన నందు సుకుమార

కన్నుల్లో నీ రూపమే మూవీ నటీనటులు: నందు, తేజస్విని ప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, షిఫ్‌ వెంకట్‌ తదితరులు; సాంకేతిక సిబ్బంది: సంగీతం: సాకేత్‌ కొమండూరి, నిర్మాత భాస్కర్‌, రచన, కథనం, దర్శకత్వం: బిక్స్‌ (బిక్షపతి).
 
గాయకుడి నుంచి నటుడిగా ఎదిగిన నందు సుకుమార్‌ చిత్రం '100%లవ్‌'లో అజిత్‌ పాత్రతో మెప్పించాడు. ఆ తర్వాత పలు క్యారెక్టర్‌లు పోషించి మెప్పించాడు. 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' వంటి చిత్రంలో హీరోగా చేశాడు. తాజాగా 'కన్నుల్లో నీ రూపమే'తో ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని యు.ఎస్‌ఎ.కు చెందిన బిక్స్‌ దర్శకత్వం వహించాడు. తనే కథను రాసుకుని సినిమాపై ఇష్టంతో తెరకెక్కించాడు. అదెలా వుందో చూద్దాం.
 
కథ:
సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే నందు స్నేహితులతో చాలా సరదాగా గడుపుతుంటాడు. నచ్చిన అమ్మాయిలతో షికారు చేస్తుంటాడు. ఓసారి తన స్నేహితుడితో వుండగా తేజస్విని నందు చెంప ఛెళ్లుమనిపిస్తుంది. అయినా బాధపడకపోగా ఆమె కళ్ళను చూస్తూ ప్రేమించేస్తాడు. అచ్చు తన అమ్మ కళ్లలా వున్నాయని భావించి పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయానికి వస్తాడు. అనుకున్నట్లుగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీస్తుంది. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అన్న సంరక్షణలో వున్న తేజస్విని పెళ్లికి తన అన్న అంగీకరించడని తెలీకుండా పెళ్లి చేసుకుందామనుకుంటారు. అందుకే ఇద్దరికి కామన్‌ స్నేహితురాలి మేరేజ్‌ అయిన తర్వాత ముహూర్తం పెట్టుకుంటారు. 
 
ఇదిలావుండగా, షిఫ్‌ వెంకట్‌ తన బాస్‌ ఆదేశాల మేరకు తేజస్వినిని కిడ్నాప్‌ చేయాలని తన బ్యాచ్‌తో తేజస్విని వెతుక్కుంటూ వస్తాడు. ఆమె ఫామ్‌హౌస్‌లో వుందని తెలుసుకుని అక్కడికి రాగానే నందుని చూసి వారు షాక్‌ అవుతారు. ఎందుకంటే నందును మూడురోజులనాడే వాళ్ళబాస్‌ చంపేశాడు. మరి ఇక్కడ వున్నది ఎవరు? నందు ఫ్రెండ్సంతా అతనితోనే ఎంజాయ్‌ ఎందుకు చేస్తున్నారు? అప్పుడు షిఫ్‌ వెంకట్‌ ఏం చేశాడు? అన్నది మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ:
నటుడిగా నందు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సన్నివేశపరంగా ఎలా ప్రవర్తించాలో అలా చేసేశాడు. తేజస్విని కొత్త కావడంతో కొన్నిచోట్ల తడబాటు పడ్డా బాగానే చేసింది. స్నేహితులుగా మిగిలిన వారు పర్వాలేదు. వారితోపాటు ప్రవీణ్‌ చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగుంది. షిఫ్‌ వెంకట్‌ పిచ్చితనం కామెడీ పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. పోసాని దేవుడు పాత్రలో కన్పిస్తాడు. ఇక సాంకేతికపరంగా సాకేత్‌ సంగీతం పర్వాలేదు. చెప్పుకోదగినవి లేకపోయినా వినడానికి బాగున్నాయి. దెయ్యం కాన్సెప్ట్‌కు గ్రాఫిక్స్‌ ముఖ్యం. ద్వితీయార్థంలో కొంతమేరకు వాటిని ఉపయోగించారు. అవి కూడా మరింత క్వాలిటీగా వుంటే బాగుండేవి. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్‌లకు అవే కీలకం. భయపెట్టే మ్యూజిక్‌ను సాకేత్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్‌ పైన ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.
 
చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్‌, పాటలు, ప్రమోషన్‌ చూశాక దర్శకుడిగా బ్రిక్స్‌ కొత్త ప్రయత్నమే బాగా తీశాడనిపిస్తుంది. తను యుఎస్‌లో వుండటంతో మరింత ఆసక్తితో తీసుంటాడని భావిస్తారు. బ్రిక్స్‌ ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుండేది. హాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలు వైవిధ్యంగా వుంటాయి. వాటిని చూసి ఎదిగిన బ్రిక్స్‌ తన మొదటి చిత్రంపై మరింత కేర్‌ తీసుకోవాల్సింది. కొన్ని షాట్స్‌ బాగున్నాయి అనుకున్నంతంలో వెంటనే గ్రాఫ్‌ పడిపోయేట్లుగా వుంటుంది. దాన్ని ఎడిటింగ్‌ పని చెబుతుదామన్నా రన్నింగ్‌లో సాధ్యపడదు. 
 
అమ్మాయి దెయ్యంగా మారడం అనేది రొటీన్‌. అబ్బాయి దెయ్యంగా మారి తన ప్రేయసి బాగుకోసం పరితపించే పాత్రలో నందు కన్పిస్తాడు. పాత్రపరంగా న్యాయం చేశాడు. దాన్ని మరింత ఆకర్షణీయంగా దర్శకుడు తీయాల్సింది. ఎందుకంటే కొన్నిచోట్ల నందు పాత్ర వాస్తవమా! కల్పితమా! అనే కన్‌ఫ్యూజన్ ప్రేక్షకుల్లో మెదులుతుంది. దాన్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేసేవిధంగా గట్టి సన్నివేశాలను రాసుకుంటే బాగుండేది. ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నంలో ఎవ్వరూ చేయనివిధంగా షిఫ్‌ వెంకట్‌ బ్యాచ్‌ను తీసుకుని కొత్త ప్రయత్నం చేశాడు దర్శకుడు. స్క్రీన్‌ ప్లే మరింత ఆకర్షణీయంగా చేస్తే బాగుండేది. మొత్తంగా కొత్తవాడయినా తననుకున్నది దర్శకుడు తెరకెక్కించాడు. అందుకు నందు పాత్ర చాలా హెల్పయింది. నిజమైన ప్రేమికులు జీవితాంతం ఎలా వుంటారనేది ఈ చిత్రం ద్వారా చెప్పారు. కథకు తగిన టైటిల్‌ పెట్టడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. యూత్‌కు టైంపాస్‌ మూవీగా నిలుస్తుంది.