శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 28 డిశెంబరు 2018 (17:57 IST)

సుమంత్ 'ఇదం జ‌గ‌త్'... ఇంకా ముందుకు సాగదే... మూవీ రివ్యూ..

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం ఇదం జ‌గత్. నూత‌న ద‌ర్శ‌కుడు అనిల్ శ్రీకంఠం ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సుమంత్ స‌ర‌స‌న అంజు కురియన్ న‌టించింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఈరోజు (డిసెంబ‌ర్ 28)న రిలీజైంది. ఈమ‌ధ్య కాలంలో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తోన్న సుమంత్ మ‌ళ్లీ రావా, సుబ్ర‌మ‌ణ్య‌పురం చిత్రాల‌తో వ‌రుసగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. మ‌రి... ఇదం జ‌గ‌త్ సుమంత్‌కి ఎలాంటి ఫ‌లితాన్ని అందించిందో చూద్దాం.
 
క‌థ: నిషిత్ (సుమంత్) ఉద్యోగం కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఫ్రీలాన్స్ రిపోర్ట‌ర్‌గా ఓ ఉద్యోగాన్ని వెతుక్కుంటాడు. రాత్రి జ‌రిగే ప్ర‌మాదాల్ని త‌న కెమెరాలో బంధించి ఆ విజుల్స్‌ని న్యూస్ ఛాన‌ల్స్‌కి అమ్ముకుని డ‌బ్బు సంపాదిస్తుంటాడు. ఇలా చేస్తున్న‌ క్రమంలో ఓ రోజు అనుకోకుండా మహతి (అంజు కురియన్) ప‌రిచ‌యం అవుతుంది. త‌ను చేస్తున్న జాబ్ గురించి చెబితే బాగోదేమో అనుకుని ఆమెతో త‌ను ఏం చేస్తున్న‌ది చెప్ప‌డు. అయితే... ఓసారి రోడ్డుపై జ‌రిగిన హ‌త్య‌ను నిషిత్ షూట్ చేస్తాడు. ఆ ఫుటేజ్‌తో డ‌బ్బులు సంపాదించాల‌నుకుంటాడు. కానీ... ఆ ఫుటేజ్ నిషిత్ జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది. అస‌లు... ఏం జ‌రిగింది..? ఆ ఫుటేజ్‌లో ఏముంది అనేదే మిగిలిన క‌థ‌. 
 
ప్ల‌స్ పాయింట్స్
 
సుమంత్ న‌ట‌న‌
క‌థా నేప‌ధ్యం
శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం
 
మైన‌స్ పాయింట్స్
క‌థ‌నం
 
విశ్లేష‌ణ: కొత్త పాయింట్‌తో క‌థ రాసుకున్న‌ప్ప‌టికీ... ఈ కథ‌కు త‌గ్గ‌ట్టుగా బ‌ల‌మైన స‌న్నివేశాలును రాసుకుని ఉండుంటే బాగుండేది. ఇలాంటి క్రైమ్ జోన‌ర్లో సినిమాల‌కు పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌, ఉత్కంఠ క‌లిగించేలా స‌న్నివేశాలు ఉండాలి. కానీ.. అవి లేవు. సుమంత్ మాత్రం త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసారు. హీరోహీరోయిన్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌, నిషిత్ ద‌గ్గ‌ర హ‌త్య‌కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని తెలిసిన‌ప్ప‌టికీ విల‌న్ క్లైమాక్స్ వ‌ర‌కు ప‌ట్టించుకోక‌పోవ‌డం... ఇలా.. చాలా విష‌యాల్లో లాజిక్ మిస్ అయ్యింది. సినిమా చూస్తుంటే.. కొన్నిసార్లు ఇంకా ముందుకు వెళ్ల‌దేంటి అనిపిస్తుంటుంది.
 
శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం బాగానే ఉంది. డైరెక్ట‌ర్ అనిల్ శ్రీకంఠం కొత్త పాయింట్‌తో క‌థ రాసుకున్నాడు కానీ... ఆ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా ఉండేలా తెర‌కెక్కించ‌లేక‌పోయాడు. ఇంకొంచెం స్ర్కిప్ట్ పైన వ‌ర్క్ చేసుంటే బాగుండేది. టోట‌ల్‌గా చెప్పాలంటే.. క్రైమ్ జోన‌ర్స్ ఇష్ట‌ప‌డేవారికి మాత్ర‌మే.
 
రేటింగ్ - 2.5/5