టెంపర్ నటీనటులు: ఎన్‌టిఆర్, కాజల్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సంగీతం: అనూప్ రూబెన్స్, కథ: వక్కంతం వంశీ, నిర్మాత: బండ్ల గణేష్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.
పాయింట్: నిర్భయ లాంటి వాళ్ళకు అన్యాయం చేస్తే తన టెంపర్‌తో దుండగులను ఎలా శిక్షించాడు అన్నది కథ.
తెలుగు సినిమాల్లో కథలు సమాజంలో జరుగుతున్న సంఘటనల బేస్ చేసుకుని రాస్తుంటారు. అందులో రకరకాల ఉదంతాలు వున్నట్లే ఆమధ్య ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం తెలిసిందే. క్రూరాతిక్రూరంగా ఓ అమ్మాయిని రేప్ చేసి ఆమె మృతికి కారణమైన సంఘటన యావత్ దేశాన్ని కదిలిచింది. కానీ వారిని శిక్షించడానికి కోర్టులు, చట్టాలు కూడా వెంటనే స్పందించడం లేదు. అందుకే ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఎస్.ఐ. దయా నాయక్ వేసిన శిక్షే 'టెంపర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో ఎన్‌టిఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆంధ్రావాలా' పెద్దగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. మళ్ళీ చాలాకాలం తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. మరి పూరీ ఇందులో హీరోలో ఎటువంటి టెంపర్ చూపించాడో చూద్దాం.
కథగా చెప్పాలంటే...
అనాధగా చిన్నతనంలోనే దొంగతనాలు చేసే దయా(ఎన్‌టిఆర్) పోలీసు డ్రెస్‌తో ఎన్నో దందాలు చేయవచ్చని పట్టుదలతో ఎస్.ఐ అవుతాడు. ఆ తర్వాత నీతి, నియమాలు లేని ఓ గూండా వాల్తేర్ వాసు(ప్రకాష్‌రాజ్) ఊరికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఇద్దరూ చేతులు కలిపి దోచేస్తుంటారు. ఎప్పుడూ టెంపర్‌గా వుండే దయా... మొదటిచూపులోనే కాజల్‌ను ప్రేమించేస్తాడు. తన పుట్టిన రోజుకు గిఫ్ట్‌గా ఓ అమ్మాయిని గూండాల నుంచి రక్షించమని షరతు పెడుతుంది. ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో వాల్తేర్ వాసుతో దండయాత్ర చేస్తాడు? అది ఎలా? ఎందుకు? అనేది మిగిలిన సినిమా.
నటీనటులు పెర్‌ఫార్మెన్స్
నటనా పరంగా ఎన్‌టిఆర్ ఎమోషన్స్ ఇంతకుముందు సినిమాల్లో చూడని విధంగా చూపించాడు. ప్రారంభం నుంచి తనలోని టెంపర్‌తనాన్ని చూపిస్తూ ఆవేశంగా డైలాగ్‌లు చెప్పేస్తుంటాడు. యాక్షన్, డాన్స్ కూడా అంతే టెంపర్‌గా వుంటుంది. ఫుల్ ఎనర్జీ అంతా ఈ చిత్రంలోనే చూపించేశాడు. కాజల్ జంతువులను ప్రేమించే మనిషిగా నటించింది. దుర్మార్గపు పనులు చేస్తూ సిటీని తన కనుసన్నల్లో వుంచుకునే పాత్రలో ప్రకాష్‌రాజ్‌కు కొత్తేమీకాదు. తనదైన శైలిలో చేసుకుంటూ పోయాడు. మంత్రిగా జయప్రకాష్ రెడ్డి నటించాడు. లాయర్‌గా సూర్య, జడ్జిగా కోట శ్రీనివాసరావుతో పాటు మిగిలినవారంతా తమ పాత్రలకు అనుగుణంగా చేసేశారు. ఓ సన్నివేశంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా దర్శనమిస్తాడు.
టెక్నికల్‌గా...
టెక్నికల్‌గా ఫొటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పాతబాణీలు విన్నట్లుగా వుంటాయి. పాటల్లో పసందైన సాహిత్యం లేకపోవడంతో పెద్దగా ఎట్రాక్ట్ అనిపించదు. 'దేవుడా. ఓ దేవుడా...'అంటూ చివరల్లో వచ్చే సాంగ్‌లోనే కథంతా చెప్పేస్తాడు. టెంపర్ అనే టైటిల్‌సాంగ్ సోసోగా అనిపిస్తుంది. ఆర్ట్ పనితనం ఫర్వాలేదు. స్క్రీన్‌ప్లేలో కొత్తదనం పూరీ చూపించాడు. సంభాషణల పరంగా పూరీ తీసుకున్న జాగ్రత్తలు మాస్‌ను అలరిస్తాయి. కథపరంగా వక్కంతం వంశీ తీసుకున్న జాగ్రత్త ముగింపు బాగుంది.
విశ్లేషణ:
ఎన్‌టిఆర్ సినిమా అంటేనే మాస్, యాక్షన్ వుంటాయని అభిమానులు ఆశిస్తారు. అలాంటివి ఈ చిత్రంలో చాలానే వున్నాయి. అయితే కథలో కొత్తదనం ఏమిటంటే.. రాఖీ చిత్రంలో చెల్లెల్ని కాల్చి చంపేయడం వారిని శిక్షించడం అనేది ప్రధాన పాయింట్. టెంపర్‌లో మాత్రం.. సమాజం ఏమైనా నాకేంటి? నేను బాగుంటే చాలనుకునే అవినీతిపరుడైన ఎస్‌ఐ. తన లవర్ కోసం మారిపోయే పాత్రను పోషించాడు. నలుగురు దుర్మార్గుల చేతిలో బలైన దీప్తి అనే అమ్మాయిని చెల్లెలుగా భావించి దుర్మార్గులకు తగిన విధంగా శిక్షించడం అనేది చాలా సినిమాల్లో వున్నా, శిక్షించే విధానం కొత్తగా చూపించాడు. సినిమాలో ఆ సన్నివేశంలో ముగింపు లేకపోతే... టెంపర్ తేలిపోయేది.
అందుకే దర్శకుడిగా, రచయితగా పూరీ చేసిన కొత్త ప్రయత్నమది. ముఖ్యంగా తప్పు చేసిన వారిని పోలీసు వ్యవస్థే కాదు, లాయర్లు, చట్టాలు కూడా ఏమీ చేయలేకపోవడానికి కారణం రాజకీయ వ్యవస్థ. అటువంటి వ్యవస్థను ప్రక్షాళన జోలికి వెళ్ళకుండా తెలివిగా వృత్తిపరంగా పోలీసు ఎలా వుండాలి? వుంటే... శిక్షలు పడేవారు తప్పించుకోలేరని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
మొదటి భాగమంతా సరదాగా సాగుతూ.. హీరోకు అవినీతి తప్పితే మరో గోల్ వుండదు. ద్వితీయ భాగంలో సగం వరకూ కథేమిటో అర్థంకాదు. దీప్తి అనే పాత్రను కాపాడే క్రమంలో హీరోకు ఎదురయిన పరిస్థితే కలచివేస్తుంది. ఆ సీన్ కోసమే సినిమాను చూడాల్సి వస్తుంది. ఇందులో ఎన్‌టిఆర్ పండించిన ఆవేశం అంతాఇంతా కాదు. ప్రతి సీన్‌లోనూ ఆవేశంతో కూడిన టెంపర్‌తనాన్ని ప్రదర్శిస్తాడు.
కానీ అంత అవసరం లేదని కొన్ని సీన్లు చెబుతున్నా... తను ఒకేలాగా అన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుంది. బహుశా తెలుగులోనే హీరోలు విలన్లు అరుపులు కేకలతో థియేటర్‌ను దద్దరిల్లేట్లు చేస్తుంటారు. సినిమా మొత్తం చూశాక.. టెంపర్‌కు బదులు అరుపు అని పెడితే బాగుండేది అనిపించేలా వుంటుంది. ఏదిఏమైనా సమాజం ఆలోచించే చిత్రాన్ని తీశారనే చెప్పాలి. ఇందుకు దర్శక నిర్మాతల్ని అభినందించాల్సిందే. మరి ఇలాంటి సినిమా ఎంతమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.
రేటింగ్: 3/5