శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (15:50 IST)

కమిటీ కుర్రోళ్లు నిర్మించిన నిహారిక మల్టీటాలెంట్ : మెగాస్టార్ చిరంజీవి

Niharika, Varun Tej, Sai Durga Tej, Adivi Shesh, Venky Atluri
Niharika, Varun Tej, Sai Durga Tej, Adivi Shesh, Venky Atluri
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.  ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి  గెస్ట్‌గా విచ్చేశారు. 
 
వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9న రాబోతోంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. మంచి కథ, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీ గారికి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్ ఉంటాయి.అనుదీప్ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
నాగబాబు మాట్లాడుతూ.. ‘ఫణి గారు ఓ కథను వినమని చెప్పారు. కానీ నేను వినలేదు. నిహారిక ఆల్రెడీ కథ వినేసింది. కథ నాకు చాలా నచ్చింది.. ఓ సారి వినండి నాన్నా అని నిహారిక చెప్పింది. వంశీ నాకు డ్యాన్స్, ఫైట్స్ లేకుండా సినిమా అంతా చూపించాడు. వంశీ కరెక్ట్‌గా తీస్తే సినిమా బాగుంటుందని అర్థమైంది. నిహారికకు మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. తెలిసిన మొహాలతో సినిమా చేయాలని అనుకుంది. కానీ కొత్త మొహాలు అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. దర్శకుడు మాత్రం నాలానే అనుకున్నాడు. అన్నయ్య చిరంజీవి గారు మొదటి చిత్రంగా పునాది రాళ్లు చేశారు. ఇందులో నటించిన వారికి కూడా దాదాపు పునాది రాళ్లు టైం చిరంజీవి గారికి ఉన్న ఏజ్ ఉంటుంది. మనవూరి పాండవులు చిత్రంలో చాలా మంది కొత్త వాళ్లున్నారు. యంగ్ స్టర్స్ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. అనుదీప్ గారు మంచి పాటలిచ్చారు. నా స్నేహితుడు ఫణికి సినిమాలు అంటే ప్యాషన్. నిహారికతో కలిసి సినిమాలు చేస్తాను అని అన్నాడు. ఈ కథ మా అందరికీ చాలా నచ్చింది. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఎండింగ్ మాత్రం ప్రముఖ నాయకుడ్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆగస్ట్ 9న రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
 
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నేను చూశాను. ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ఈ చిత్రంలో ఉన్నట్టే నాకు ఓ 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మూవీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ప్రతీ కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది. చాలా చోట్ల కన్నీరు పెట్టేసుకున్నాను. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందనిపిస్తుంది. అసలు ఈ చిత్రంలో పన్నెండు పాటలున్నాయని నాకు అనిపించలేదు. అనుదీప్ మంచి పాటలు ఇచ్చారు. కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఈ ఇండస్ట్రీలో అందరికీ స్థానం ఉంటుంది. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు.
 
సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ‘ కమిటీ కుర్రోళ్లు టైటిల్ విన్నప్పుడే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అందరూ అద్భుతంగా నటించారు.  వంశీ గారి మేకింగ్, టేకింగ్.. అనుదీప్ మ్యూజిక్, రాజు గారి విజువల్స్ అన్నీ బాగున్నాయి. మా నిహారిక నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఫణి గారి ఎంతో సహకరించారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు.
 
అడివి శేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం అందరూ కమిటెడ్‌గా పని చేశారని అర్థం అవుతోంది. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఈ చిత్రంలో అన్ని అంశాలను చూపించారు. ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది. టీం మీద రెస్పెక్ట్‌తో ఇక్కడకు వచ్చాను.  చాలా పాజిటివ్ వైబ్‌ కనిపిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ కూడా కలెక్షన్లతో పాటుగా, అవార్డులను కూడా కొల్లగొడుతుంది. వంశీ గారితో నాకు ఓ సినిమా చేయాలని ఉంది. అనుదీప్ గారి పాటలు చాలా నచ్చాయి. నిహారిక, ఫణి గారికి మంచి సక్సెస్ రావాలి. ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.