1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (18:24 IST)

సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ విడుదల

siddu Jonnalagadda, Tillu Square
siddu Jonnalagadda, Tillu Square
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనతికాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. సిద్ధు పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ముఖ్యంగా ఆయన నటించిన 'డీజే టిల్లు' చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన "అట్లుంటది మనతోని", "నువ్వు అడుగుతున్నావా రాధిక" వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా 'డీజే టిల్లు' చిత్రం, అందులోని సిద్ధు పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాయి.
 
ఐకానిక్ క్యారెక్టర్ 'టిల్లు'తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. 'డీజే టిల్లు' చిత్రానికి కొనసాగింపుగా 'టిల్లు స్క్వేర్' చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఇప్పటికే "టికెట్టే కొనకుండా", "రాధిక" పాటలను విడుదల చేయగా.. రెండు పాటలూ విశేషంగా ఆకట్టుకొని, చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.
 
ఫిబ్రవరి 7న సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా నుండి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది. రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) నుండి టిల్లు ముద్దును పొందడం మనం గ్లింప్స్‌ లో చూడవచ్చు. అతని గత పుట్టినరోజు గురించి లిల్లీ అడుగగా.. రాధికతో జరిగినప్పటి సంఘటనలను టిల్లు గుర్తు చేసుకోవడం ఆకట్టుకుంది. 
 
అయితే రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా ముగించాడు. అలాగే ఆ విషయం అతనికి బాధ కలిగిస్తుంది కాబట్టి.. దాని గురించి ఇక ప్రశ్నలు అడగవద్దని లిల్లీని కోరతాడు. మొత్తానికి వీరి మధ్య సంభాషణ ఎంతో వినోదభరితంగా సాగింది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మరోసారి డైలాగులతో మ్యాజిక్ చేశాడు. 
 
ఈ గ్లింప్స్‌ లో అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా అందంగా, మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ గ్లింప్స్‌ మునుపటి చిత్రం 'డీజే టిల్లు'లో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా, 'టిల్లు స్క్వేర్' ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కూడా కలిగిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
 
ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా  వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.