గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (12:34 IST)

కరోనా ఉధృతి : 3 వేల మంది జూడాల రాజీనామా.. కోర్టు తీర్పు బేఖాతర్

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. తొలి, రెండు దశల కరోనా వైరస్ దెబ్బకు అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వైద్యులు కూడా ఉన్నారు. దాదాపుగా వందలాది మంది వరకు వైద్యులను కరోనా వైరస్ కబళించింది. ఈ నేపథ్య మధ్యప్రదేశ్‌లో దాదాపు మూడు వేల మంది వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
అంతేకాకుండా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు 24 గంటల్లో తిరిగి విధుల్లో చేరాలని మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం ఆదేశించింది. కానీ, జూడాలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. నాలుగు రోజుల వైద్యుల సమ్మెను చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
 
రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది జూనియర్ వైద్యులు గురువారం రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ఆయా కళాశాలల డీన్‌లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎంపీజేడీఏ) అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ మీనా తెలిపారు. సోమవారం ప్రారంభమైన తమ సమ్మె డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 
మరోవైపు, హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. మెడికల్ ఆఫీసర్ల సంఘం, రెసిడెంట్ డాక్టర్ల సంఘాలు కూడా త్వరలో సమ్మెలో పాల్గొంటాయని డాక్టర్ అరవింద్ మీనా వెల్లడించారు. 
 
కాగా, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, ఎయిమ్స్-రిషికేష్ జూనియర్, సీనియర్ వైద్యులు తమకు మద్దతు తెలిపారని, తమ డిమాండ్లను నెరవేర్చుతామని మే 6న హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదని అరవింద్ ఆరోపించారు.