శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (18:42 IST)

జంతువులను హింసిస్తే.. ఐదేళ్ల జైలు శిక్ష

జంతువులపై దాడులు వంటి అకృత్యాలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష తప్పదు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే 60 ఏళ్ల నాటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించనుంది. ఇందులో భాగంగా సంబంధిత ముసాయిదాలో జంతువులపై నేరాలను మూడు వర్గాలుగా ప్రతిపాదించింది. చిన్నగాయం, పెద్ద గాయం, జంతువు మరణం.. వంటి కేటగిరీలుగా విభజించి, జరిమానాలు, శిక్షలు పేర్కొన్నారు. 
 
రూ.750 నుండి రూ.75 వేల వరకు జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ప్రస్తుతం జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో రూ.100 జరిమానా, 3 నెలలు జైలు లేదా ఆ రెండింటినీ కలిపి విధించే అవకాశమున్నది. ఇటీవల పలు ఏనుగులను కొందరు ఘోరంగా హింసించిన సంఘటనలు బయటపడ్డాయి. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు నాటు బాంబులతో కూడిన పళ్లను తినిపించగా ఆ పేలుడుకు తీవ్రంగా గాయపడి అది మరణించింది.
 
 ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించారు. జంతువులపై హింస, క్రూరత్వాన్ని నిరోధించడానికి ప్రస్తుత చట్టాన్ని సవరించాలని ప్రశ్నోత్తరాల్లో అడిగారు. దీనిపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఈనెల 5న లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
 
జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960ను సవరించి మరింత కఠిన శిక్షలు, జరిమానాలు విధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. సవరణ ముసాయిదాలో జరిమానాలు, జైలు శిక్షలను పెంచే నిబంధనలు చేర్చినట్లు వెల్లడించారు. 
 
మరోవైపు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో 316 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఇలాంటి 64 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. 38 కేసులు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నట్లు పేర్కొంది.