శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 ఆగస్టు 2021 (09:39 IST)

వందలాది మంది మహిళలను అపహరించుకుపోయిన తాలిబన్ మిలిటెంట్లు?

తాలిబన్లు అంటేనే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో వణికిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆ దేశాన్ని ఏకంగా తాలిబన్ ఫైటర్లు వశం చేసుకుంటే అక్కడ ప్రజల పరిస్థితి ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రాణభయంతో ఎలాగైనా ఆఫ్ఘన్ దేశాన్ని వీడి వచ్చేయాలని విమానాల పైకి ఎక్కేస్తున్నారు. కొందరు విమాన చక్రాలను పట్టుకుని వేలాడుతూ గగనతలంలో పట్టుతప్పి కిందపడి చనిపోయారు. ఈ దారుణ దృశ్యాలు ఇపుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కనబడుతున్నాయి. 
 
ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు తాలిబాన్ మిలిటెంట్ల మధ్య ఘోరమైన యుద్ధం నుండి తప్పించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని షహర్-ఇ-నవ్ పార్క్‌లో ఆశ్రయం పొందిన వందలాది మంది మహిళలు తప్పిపోయారని సమాచారం వస్తోంది. వారిని తాలిబన్లు అపహరించుకుపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక ప్రావిన్స్‌ల నుండి వేలాది మంది పౌరులు తమ పట్టణాలు, గ్రామాలను విడిచి పారిపోతున్నారు. షహర్-ఇ-నవ్ పార్క్‌లో ఆశ్రయం పొందిన వందలాది మంది మహిళలు అదృశ్యమయ్యారని, గత కొద్ది రోజులుగా కుటుంబాలు వెతుకుతున్నాయి, కానీ వారు దొరకలేదని ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ఓ పౌరుడు చెప్పాడు.
 
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు బాంబు దాడి, తుపాకీ కాల్పులు, వైమానిక దాడులు కొత్తేమీ కాదని, ఎందుకంటే వారు చిన్న వయస్సు నుండే అలవాటు పడ్డారని, అయితే వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని అతడు చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో యువత జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటుందన్నాడు.
 
ముఖ్యంగా యువతులు. తాలిబాన్ మిలిటెంట్లు ఇళ్లలోకి చొరబడతారు. వారు యువతులను బలవంతంగా తీసుకెళ్తారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇది జరుగుతోంది కానీ ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన చెప్పారు. షహర్-ఇ-నవ్ పార్క్ నుండి వందలాది మంది యువతులు అకస్మాత్తుగా తప్పిపోతే ఎవరు బాధ్యత వహించాలి? అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేసాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు నాశనమైపోతోందనీ, ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు తాలిబాన్లకు దేశాన్ని అప్పగించి పారిపోతే, ఇప్పుడు అక్కడి ప్రజల గతి ఏమిటి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసాడు.