సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 డిశెంబరు 2019 (22:28 IST)

నిజంగా నెల్లూరులో అలా వుందా? ఆనం అంతమాట ఎందుకన్నారు?

మొన్ననే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా 6 నెలలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఘనమైన కార్యక్రమాలు జరిగాయి. ఏవో అడపాదడపా లుకలుకలు తప్ప ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు శభాష్ అనిపించుకున్నాయి.

కానీ మంత్రుల పనితీరు పట్ల మాత్రం ఓ మీడియా నిర్వహించిన సర్వేలో ప్రజల్లో తేడా ఫలితాలు వచ్చాయి. దీనికితోడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడటం చూస్తే ఎక్కడో తంతుందన్నయ్యా అన్నట్లుగా వుంది. 
 
ఇంతకీ ఆనం రామనారాయణ ఏమన్నారంటే... నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతుందని పెద్ద పదం వాడేశారు. ఇక్కడ కావల్సినన్ని మాఫియాలు, లిక్కర్, ల్యాండ్, శ్యాండ్... ఏది కావాలంటే అది వుందని తీవ్ర ఆరోపణ చేశారు. నెల్లూరును మాఫియా చేతుల్లో పెట్టేసారనీ, ఇక్కడి వ్యవస్థలు కూడా సరిగా పనిచేయడం లేదని అన్నారు. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైసీపీలో పెను సంచలనం సృష్టించాయి. 
 
ఇప్పటివరకూ వైసీపీలోని ఎమ్మెల్యేలు ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఆనం ఒక్కసారిగా చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత ఆనంపై చర్య తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మరి అది ఎలాంటి చర్య అన్నది చూడాల్సి వుంది. మరోవైపు ఆనం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న కోణంలోనూ సీఎం జగన్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.