సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

వైకాపా ఎమ్మెల్యేను అరెస్టు చేయించిన సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలన సాగిస్తున్నారు. ఇప్పటిలే లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు. గ్రామ స్వరాజ్య స్థాపనే దిశగా గ్రామ సచివాలయాలను నెలకొల్పారు. అలాగే, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోనని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 
 
మహిళా ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కేసులో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సీఎం జగన్ అరెస్టు చేయించారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... చర్యలు తీసుకోవాలంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కోటంరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేశారు. 
 
ముఖ్యంగా పారదర్శక పాలన చేస్తానని ముందు నుంచి చెబుతూ వస్తోన్న జగన్.. తప్పు చేస్తే ఎవ్వరినీ వదలనని పలు సందర్బాల్లో వెల్లడించారు. ఆ మాటకు కట్టుబడి ఉండి.. తాజాగా తన సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆయన అరెస్ట్ చేయించారు. దీంతో ఏపీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. 
 
సాధారణంగా అధికారంలో ఉన్న ఎవరైనా.. తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుతూ ఉంటారు. కానీ జగన్ మాత్రం తప్పు చేసిన తన ఎమ్మెల్యేను అరెస్టు చేయించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
అయితే ఇలాంటి ఘటనే గతంలో చంద్రబాబు హయాంలోనూ జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్.. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కూడా లభించాయి. 
 
అదొక్కటే కాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని ఆగడాలు మరెన్నో సాగాయి. కానీ అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం చింతమనేనిపై ఈగ వాలనీయకుండా చూసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
అంతేకాదు వనజాక్షి విషయంలో.. ఆమెను ఇంటికి పిలిపించుకొని వ్యవహారం సెటిల్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ జగన్ మాత్రం చంద్రబాబులా కాకుండా.. ఘటనపై ఆరా తీసి, ఎమ్మెల్యేను అరెస్టు చేయించడం గమనర్హం. 
 
ఏది ఏమైనా ఆరు నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటానని వాగ్ధానం ఇచ్చిన జగన్.. ఈ విషయంలో మాత్రం నిజంగానే అనిపించుకున్నాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు.