1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (18:56 IST)

అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు: అసెంబ్లీలో చర్చించేందుకు ఏపీ సర్కార్ సిద్ధం?

అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నాయకులు దీనిపై స్పందించారు. సీనియర్ నాయకుడు, వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరగాలంటూ ఆయన పేర్కొన్నారు.

 
చట్టాలను చేయడం అసెంబ్లీ హక్కు అనీ, దాన్ని తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించిన ధర్మాన దీనిపై ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మరికొందరు నేతలు అమరావతి రాజధాని విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.

 
ఐతే హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా తెలియజేసింది. ఒకసారి ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత దాని పట్ల మిగిలివారు ఆ సమయంలో ఎలాంటి వ్యతిరేకత కనబరచనప్పుడు ఆ తర్వాత తిరిగి దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఉటంకిస్తూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా రూలింగ్ ఇచ్చింది.

 
అంటే... అమరావతి రాజధాని ప్రకటించి రైతుల నుంచి భూ సమీకరణ జరిగిపోయిన తర్వాత అంతా అందుకు అంగీకరించాక తిరిగి దాన్ని రద్దు చేయడం లేదా ఆ ఒప్పందం నుంచి ఏ వ్యక్తి అయినా ప్రభుత్వం అయినా వైదొలగడం సాధ్యం కాదని రిట్ ఆఫ్ మాండమస్ తెలియజేస్తుంది. మరి దీనిపై అసెంబ్లీలో ఎలాంటి చర్చ చేస్తారన్నది వేచి చూడాల్సిందే.