బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:07 IST)

ఏపీ సర్కారుపై పీకే విమర్శలు.. రైల్వే ప్రాజెక్టులపై శ్రద్ధ లేదంటూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. రైల్వే ప్రాజెక్టులపై సర్కారు ఏమాత్రం శ్రద్ధ లేదని ఆయన ఆరోపించారు. కీలకమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణపై ఏమాత్రం శ్రద్ధ చూపించకపోవడం నిర్లక్ష్య ధోరణి కాదా అని ఆయన నిలదీశారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం అలక్ష్యం కారణంగానే ఆలస్యమవుతున్నాయని చెప్పారు. కేంద్రం కేటాయించే నిధులకుతోడు ఏపీ ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులను మంజూరు చేయకపోతే ఈ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ఆయన నిలదీశారు. 
 
"రాష్ట్రంలో కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కోటిపల్లి - నరసాపురం రైల్వే లైపు పనులు ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా అలాగే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు తన వాటాగా 25 శాతం నిధులు సమకూర్చాలి. అయితే, ఆ మొత్తాన్ని మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.358 కోట్లు ఇస్తే ఈ పనులు ముందుకు సాగుతాయి. ఈ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది" అని ఆయన అన్నారు.