శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: గురువారం, 28 జనవరి 2021 (15:31 IST)

నామినేషన్‌ వేసేటప్పుడు ఏం చేయాలి? ఎంత డబ్బు డిపాజిట్‌ కట్టాలి? ఎంతమంది పిల్లలుంటే పోటీ చేయొచ్చు?

పంచాయతీకి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు అనుకూలంగా మారిన చోట ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు వార్డు అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు ఇలా ఉన్నాయి. 
 
పరిశీలన నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్లు ఉండాలి. పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి. రేషన్‌ దుకాణం డీలర్లు, సహకార సంఘాల సభ్యులు అర్హులే.ఇద్దరుకంటే ఎక్కువ పిల్లలుంటే ఎన్నికలలో పోటీకి వీలు లేదు. ఒకవేళ ఆ వ్యక్తికి 1995 మే 31 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే పోటీ చేసేందుకు అర్హులే. 
 
ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణిస్తారు. వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించరు. ఒక వ్యక్తి ముగ్గురు పిల్లలుంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా అనర్హుడిగానే పరిగణిస్తారు.
 
ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానంగా పరిగణిస్తారు. అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీకి అర్హురాలు.
 
ముగ్గురు పిల్లలున్న వ్యక్తికి నామినేషన్‌ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు. ఇద్దరు పిల్లలున్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కాదు. నామినేషన్‌ పరిశీలన తేదీ నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తర్వాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్‌ పరిశీలన చేస్తారు. అంగన్‌వాడీ వర్కర్లు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులకు అవకాశం లేదు.
 
స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 1987 హిందూ మత సంస్థలు చట్టం, దేవదాయ శాఖ సెక్షన్‌ ప్రకారం సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే వారు అనర్హులు. మతిస్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీకి అనర్హుడు.
 
నామినేషన్‌ కొన్ని ముఖ్య విషయాలు
అభ్యర్థికి ప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు. అభ్యర్థిపై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి ఇచ్చిన సమాచారం తప్పు అని భావిస్తే ఐసీసీ సెక్షన్‌ 177, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. కానీ నామినేషన్‌ తిరస్కరించకూడదు. నామినేషన్‌ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్‌ తీసుకుంటారు.
 
చెక్‌ లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్‌ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు. 
 
పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టకుంటే అపిడవిట్‌ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్‌ అధికారి తనంతట తాను సంతృప్తి పొందాలి. ప్రతిపాదకుడి సంతకం ఫోర్జరీ అని తేలితే దానికి రిటర్నింగ్‌ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్‌ తిరస్కరించవచ్చు.
 
ఒక వ్యక్తి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు. చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు. చెల్లుబాటు జాబితా ప్రకటించేవరకు నిరీక్షించి అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలి. నామినేషన్‌ వేయటానికి అభ్యర్థి, ప్రతిపాదకునితోపాటు మరో ముగ్గురిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి తమ గదిలోకి అనుమతి ఇస్తారు. 
 
నామినేషన్‌లో అభ్యర్థి సంతకం మరచిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ వేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం లేదు. అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణకు నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాత పూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించవచ్చు. 
 
రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మరుసటి రోజు సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డీవోకు అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేయవచ్చు.
 
నామినేషన్‌ డిపాజిట్‌ వివరాలు
వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నామినేషన్‌ రుసుం కింద రూ.500, ఇతరులు రూ.1000 చెల్లించాలి. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1500, ఇతరులు అయితే రూ.3 వేలు చెల్లించాలి.