Arrest leena manimekalai: కాళికా మాత నోట్లో సిగరెట్
నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల వేడి తగ్గలేదు. ఇంకోవైపు మరో వివాదాస్పద పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై తన తాజా డాక్యుమెంటరీ కాళి పోస్టర్‌ను ట్వీట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో ట్రెండ్ అయింది.
గత శనివారం ట్వీట్ చేసిన పోస్టర్‌లో హిందూ దేవత కాళి వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతూ, ఎల్‌జిబిటి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించే జెండాను చేతిలో పట్టుకుని ఉంది.
నోట్లో సిగరెట్ పెట్టుకుని వున్న కాళీ పోస్టర్ ఆన్‌లైన్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలా మంది లీనామణిమేఖలైను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. #Arrestleenamanimekalai ట్విట్టర్‌లో ట్రెండింగ్ మొదలైంది.
సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిస్పందనను అనుసరించి, కెనడాకు చెందిన మణిమేకలై యూజర్లను #అరెస్ట్ లీనా మణిమేకలై"కి బదులుగా "లవ్ యు లీనా మణిమేకలై" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలని కోరారు. “ఒక సాయంత్రం కాళీ కనిపించి టొరంటో వీధుల్లో షికారు చేసే సంఘటనల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. మీరు చిత్రాన్ని చూస్తే, అరెస్ట్ లీనా మణిమేకలై అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచరు, లవ్ యు లీనా మణిమేకలై హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టేస్తారు” అని సోమవారం నాడు తమిళంలో రాసారు.
కాగా గత వారాంతంలో టొరంటోలోని అగాఖాన్ మ్యూజియంలో బహుళ సాంస్కృతికతను జరుపుకునే వారం రోజుల పండుగ అయిన రిథమ్స్ ఆఫ్ కెనడా సందర్భంగా ఈ కాళీ వేషధారణ మొదటిసారిగా ప్రదర్శించబడింది. ఈ పోస్టర్ చూసిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.