ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:07 IST)

రైలు కిటికీలో నుంచి మొబైల్ చోరీకి యత్నం.. తగిన శిక్ష విధించిన ప్రయాణికులు (Video)

mobile thief caught
బీహార్‌ రాష్ట్రంలో సాహెబ్‌పూర్ కమాల్ రైల్వే స్టేషనులో రైలు బోగీలో కూర్చొనివున్న ఓ రైలు ప్రయాణికుడి చేతిలోన మొబైల్ ఫోనును తస్కరించేందుకు ప్రయత్నించిన దొంగకు ప్రయాణికలు జీవితంలో మరిచిపోలేని శిక్ష విధించారు. కిటికీల్లో చేతులు పెట్టిన దొంగ రెండు చేతులను ప్రయాణికులు పట్టుకున్నారు. దీంతో దొంగ ఏకంగా 15 కిలోమీటర్ల మేరకు కిటికీలకు వేలాడుతూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగింది. ప్లాట్‌ఫామ్‌పై మాటువేసిన ఓ దొంగ అదే అదునుగా రైలు కిటికీలోంచి ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ను చోరీ చేసేందుకు యత్నించాడు. క్షణాల్లోనే అప్రమత్తమైన ప్రయాణికుడు చటుక్కున అతడి చేయి పట్టుకున్నాడు. 
 
అదేసమయంలో రైలు కదలడంతో దొంగ తనను వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. ఈలోపు రైలు ప్లాట్‌ఫామ్ దాటింది. దీంతో పట్టుకోల్పోతుండటంతో రెండో చేతిని కూడా దొంగ కిటికీలో పెట్టాడు. లోపలున్న ప్రయాణికులు ఆ చేతిని కూడా గట్టిగా పట్టుకుని కిందపడిపోకుండా కాపాడారు. 
 
ఇలా 15 కిలోమీటర్లపాటు దొంగ కిటికీ వద్దే వేలాడాడు. ఆ తర్వాత రైలు ఖగారియా స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో అతడిని విడిచిపెట్టారు. అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరేమో దొంగకు భలేగా బుద్ధి చెప్పారని అంటుంటే.. దొంగ అయితే మాత్రం అలా వేలాడదీయడం చాలా దారుణమని కామెంట్స్ చేస్తున్నారు.