గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2022 (15:02 IST)

సీఎం కేసీఆర్.. హైదరాబాద్ టు పాట్నా... జాతీయ రాజకీయాలపై చర్చ

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ బుధవారం బిహార్ రాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాట్నాకు ఆయన వెళ్లారు. గతంలో ప్రకటించిన మేరకు ఇండోచైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో జరిగిన ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణంలో పలువురు భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఆయన బిహార్ రాష్ట్రానికి వెళ్లారు. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. 
 
అలాగే, ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా సీఎం ఆర్థిక సాయం చేస్తారు మరణించిన ఒక్కో వలస కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తారు. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఈ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తారు. 
 
ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ మీటింగ్‌పైనే ఇపుడు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయాలపైనే వీళ్లిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఏయే అంశాలపై చర్చిస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. అలాగే వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
మరోవైపు, అటు బిహార్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇటు తెలంగాణాలో కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ తనయ కవిత పేరును సీబీఐ ప్రస్తావించింది. ఇపుడు ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.