సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (22:21 IST)

మందు బాబులకు శుభవార్త చెప్పిన కేంద్రం... గ్రీన్ జోన్లలో...

దేశంలోని మందుబాబులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కేసులు అతి తక్కువగా ఉన్న గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, కొన్ని షరతులను విధించింది. దీంతో దేశంలోని మద్యంబాబులు తెగ సంతోషపడిపోతున్నారు. 
 
దేశంలో మరోమారు లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల్లో వేటికి అనుమతి ఉంటుంది..? వేటిపై నిషేధం ఉంటుందనే విషయాలను నిశితంగా వివరించింది. ముఖ్యంగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే.. కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం పూర్తిగా ఆంక్షలు అమలు కానున్నాయి.
 
ముఖ్యంగా, మద్యం ప్రియులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే వీటికి కొన్ని కండిషన్స్ పెట్టింది. గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మాత్రమే మద్యం అమ్మకాలకు హోంశాఖ అనుమతిచ్చింది. విధిగా ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, దుకాణం వద్ద ఒక్కసారి ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువమంది ఉండరాదని స్పష్టం చేసింది. ఇది గ్రీన్ జోన్ల వరకే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. 
 
మద్యం షాపుల వద్ద ఒకసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. భౌతిక దూరం పాటిస్తూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గుట్కా, పొగాకు అమ్మకాలకు మళ్లీ నిషేధం విధించింది.
 
కాగా.. రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాల రాకపోకలపై నిషేధం యధాప్రకారం కొనసాగుతుంది. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదు. అంతర్ జిల్లా, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది. 
 
అయితే, కరోనా కేసులు అధికంగా ఉండే రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఉండవని, ఓ మోస్తరు కేసులుండే ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ, 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిప్పేందుకు కూడా కేంద్రం అనుమతించింది.