డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు.. 3 యేళ్ళకు రీచార్జ్... రూ.10 వేల క్యాష్ : సీఎం చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లను రూ.1000 నుంచి రూ.2000 పెంచిన ఆయన.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.10 వేల నగదుతో పాటు.. ఓ స్మార్ట్ ఫోనును ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని 26న జరిగే స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయనే స్వయంగా ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా మహిళలకు 'పసుపు - కుంకుమ' పేరిట రూ.2,500 చొప్పున నాలుగు విడతల్లో రూ.10 వేలను చంద్రబాబు అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇవ్వదలచిన రూ. 10 వేలను రెండు విడతలుగా ఇవ్వాలా? లేక మూడు విడతల్లో ఇవ్వాలా? అన్నది ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడివుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలి విడతను రెట్టింపు చేసిన పింఛన్ల మొత్తంతో పాటే ఫిబ్రవరిలో అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, ఇప్పటికే వాటి కొనుగోలుకు టెండర్లను పిలిచారు. రెండు కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఫోన్‌తో పాటు వాటిని మూడు సంవత్సరాలు రీచార్జ్ చేయించాలన్న ప్రతిపాదనపైనా 26 నాటి సమావేశంలో చంద్రబాబు నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.గా, ప్రస్తుతం రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉండగా, వారికి రూ. 10 వేల చొప్పున ఇవ్వడానికి రూ. 9,400 కోట్లు కావాలి. ఇక ఒక్కో స్మార్ట్ ఫోన్ ఖరీదు రూ. 4 వేలుగా లెక్కేసినా, అందుకు రూ. 3,760 కోట్లు, మూడు సంవత్సరాల రీచార్చ్ వ్యయం కనీసం మరో రూ. 240 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా