1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:57 IST)

దేశంలో తొలిసారి బూస్టర్ డోస్‌పై పరిశోధన.. వలంటీర్లు దొరక్క ఇక్కట్లు

ప్రపంచాన్ని కరోనా వైరస్ వేరియంట్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. దీంతో కరోనా బూస్టర్ డోస్ అంశం తెరపైకి వచ్చింది. అయితే, భారత్‌లో బూస్టర్ డోస్ అక్కర్లేదని ఇన్నాళ్లూ కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ఇపుడు బూస్టర్ డోస్‌పై అధ్యయనం ప్రారంభమైంది. 
 
ఇందుకోసం దేశంలో తొలిసారి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఈ బూస్టర్ డోస్‌పై అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం మూడు నుంచి ఆరు నెలల కిందట కోవాగ్జిన్ రెండు మోతాదుల టీకా వేయించుకున్న వలంటీర్లు అవసరమయ్యారు. కానీ, కోవాగ్జిన్ తీసుకున్నవారు ఎక్కువ మంది అందుబాటులో లేరు. దీంతో ఈ బూస్టర్ డోస్ ప్రయోగానికి ఆటంకం ఏర్పడుతుంది. 
 
నిజానికి భారత్‌లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అందిస్తున్న వ్యాక్సిన్లలో 88 శాతం వాటా కోవిషీల్డ్‌దే. అందుకే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కోవాగ్జిన్ టీకాలు వేయించుకున్న వారి కోసం ఈ ఇనిస్టిట్యూట్ ఆరా తీస్తుంది. మూడు నుంచి ఆరు నెలల కిందట రెండో డోస్ కోవాగ్జిన్ టీకా తీసున్న వారు ఈ బూస్టర్ డోస్ అధ్యయనానికి అర్హులు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.